Site icon NTV Telugu

Nirbhay cruise missile: చైనా-పాకిస్తాన్‌కి వణుకే.. నిర్భయ్ క్షిపణి విజయవంతం..

Nirbhay

Nirbhay

Nirbhay cruise missile: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) గురువారం పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో నిర్మితమైన నిర్భయ్ ITCM(ఇండీజినియస్ టెక్నాలజీ క్రూయిజ్ మిస్సైల్) క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ రేంజ్ నుంచి ఈ మిస్సైల్ ప్రయోగం జరిగింది. ఈ లాంగ్ రేంజ్ సబ్ సోనిక్ క్రూయిజ్ పరీక్ష సమయంలో మిస్సైల్‌లోని అన్ని వ్యవస్థల్ని ట్రాక్ చేసి, సక్రమంగా పనిచేసినట్లు రక్షణ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. మిస్సైల్ గమనాన్ని నిర్ధారించడానికి రాడార్, ఎలక్ట్రో-ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్(EOTS) మరియు టెలిమెట్రీ వంటి అనేక సెన్సార్ల ద్వారా క్షిపణి పనితీరును వివిధ ప్రాంతాల నుంచి పరిశీలించారు. క్షిపణి మార్గాన్ని వైమానిక దళానికి చెందిన Su-30-Mk-I ఫైటర్ జెట్ నుంచి కూడా పర్యవేక్షించారు.

Read Also: MP Laxman: కాంగ్రెస్ 400 స్థానాల్లో గెలిచే అవకాశం లేదని మమతా బెనర్జీ చెబుతుంది..

క్షిపణి అనుకున్న విధంగానే సరైన మార్గంలో ప్రయాణించింది, సముద్రం మీదుగా తక్కువ ఎత్తులో ఎగిరింది. పరీక్ష సమయంలో నిర్భయ్ క్షిపణి గంటకు 864 కి.మీ నుండి 1111 కి.మీ వేగాన్ని సాధించింది. ఈ క్షిపణికి టెర్రైన్ హగ్గింగ్ సామర్ధ్యం కూడా ఉంది. దీని వల్ల ఈ క్షిపణిని శతృదేశాలు కనుగొనడం కష్టం అవుతుంది. ఇది రెండు దశల్లో ఇంధనాన్ని వాడుతుంది. మొదటి దశలో సాలిడ్ ఫ్యూయల్, రెండో దశలో లిక్విడ్ ఫ్యూయల్‌ని వినియోగిస్తుంది. నిర్భయ్ క్షిపణి 300 కిలోల బరువున్న సంప్రదాయ ఆయుధాను మోసుకెళ్లగలదు. దీని గరిష్ట పరిధి 1500 కి.మీ. ఇది భూమి నుంచి 50 మీటర్ల నుంచి గరిష్టంగా 4 కి.మీ ఎత్తున ప్రయణిస్తూ టార్గెట్లను ధ్వంసం చేయగలదు. ఇది తన మార్గం, దిశను మార్చుకునే వ్యవస్థను కలిగి ఉంది. ఇది కదిలే లక్ష్యాలను కూడా నాశనం చేయగలదు. సముద్రం, భూమి పై నుంచి ఈ మిస్సైల్‌ని ప్రయోగించవచ్చు.

ఈ మిస్సైల్‌తో భారత సైన్యం శక్తి మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్, చైనా వంటి దేశాలతో సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ క్షిపణిని భారత్-చైనా సరిహద్దు ఎల్ఏసీ వద్ద మోహరించాలని భావిస్తున్నారు. నిర్భయ్ పొడవు 6 మీటర్లు కాగా.. 0.52 మీటర్ల వెడల్పు, రెక్కల మొత్తం పొడవు 2.7 మీటర్లు కలిగి ఉంది. ఇది శతృదేశాల రాడార్లను కూడా ఏమార్చగలదు. అతి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ రాడార్లకు చిక్కకుండా దాడి చేయగలదు. ఇది లక్ష్యాలను గుర్తించిన తర్వాత వాటి చిత్రాలను క్యాప్చర్ చేసి కంట్రోల్ రూంకి పంపే సాంకేతికత కూడా ఉంది. ఇది స్వదేశీ ప్రొపల్షన్ సిస్టమ్ అయిన మానిక్ టర్బో ఫ్యాన్ ఇంజన్‌ని వాడారు. ITCM విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్డీవోను అభినందించారు.

Exit mobile version