NTV Telugu Site icon

Fertility: IVF సెంటర్లకు పరుగుపెడుతున్న భారతీయులు.. పడిపోతున్న సంతానోత్పత్తి రేటు.. కారణాలేంటి..?

Fertility

Fertility

Fertility: భారతదేశంలో దంపతులు IVF సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా నగరాల నుంచి చిన్నచిన్న పట్టణాల్లో కూడా IVF క్లినిక్స్ పుట్టుకొస్తున్నాయి. పెళ్లైన దంపతులు ఏళ్లకేళ్లు పిల్లల కోసం పరితపిస్తున్నారు. దేశంలో చాప కింద నీరులా ‘ఫెర్టిలిటీ’ సమస్యలు పెరుగుతున్నాయి. ఒక నివేదిక ప్రకారం, దేశంలో ఏడాదిలో సగటున 2-2.5 లక్షల ఐవీఎఫ్ సైకిల్స్ నిర్వహిస్తున్నారు. దేశంతో సంతానోత్పత్తి రేటు గణనీయంగా పడిపోతుండటం ఐవీఎఫ్ క్లినిక్‌లకు వరంగా మారుతోంది.

లాన్సెట్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో సంతాతోత్పత్తి రేటు 1950లో 6.18 నుంచి 2021 నాటికి 1.91కి పడిపోయింది. మారిన జీవనశైలి, ఒత్తిడి, జన్యుపరమైన కారణాలు ఫెర్టిలిటీపై తీవ్ర ప్రభావాలు చూపిస్తున్నాయి. పిల్లలు లేని జంటలు ఇప్పుడు ప్రైవేట్ క్లినిక్స్ అందించే ‘‘అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్(ART)’’ సహాయం తీసుకుంటున్నాయి.

దేశం మొత్తం సంతానోత్పత్తి రేటు(TFR) అనేది ఒక స్త్రీకి తన జీవిత కాలంలో జన్మించే సగటు పిల్లల సంఖ్యను సూచిస్తుంది. ప్రతీ స్త్రీకి 2.1 మంది పిల్లల TFR ఉంటే జనాభా స్థిరంగా ఉంటుంది. ఈ రేటను ‘‘రిప్లేస్‌మెంట్ లెవల్’’గా పిలుస్తాం. సంతానోత్పత్తి రేటు దీని కన్నా తగ్గినప్పుడు జనాభా పడిపోవడం ప్రారంభమవుతుంది.

Read Also: INDIA Bloc: కేజ్రీవాల్‌ కోసం రంగంలోకి ఇండియా కూటమి.. ఢిల్లీలో భారీ నిరసనకు ప్లాన్!

కారణాలేంటి..?

ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా గత 70 ఏళ్లలో సంతానోత్పత్తి రేటు 50 శాతం క్షీణించిందని 2022లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) నివేదిక పేర్కొంది. పిల్లల పెంపకం ఖర్చు, గర్భనిరోధకం వంటి కొన్ని ఆర్థిక కారణాల వల్ల సంతానోత్పత్తి తగ్గుతోంది. మహిళా అక్షరాస్యత పెరగడం, శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం అనే కొన్ని సామాజిక కారణాలు కూడా ఇందుకు కారణమవుతున్నాయి.

భారతదేశంలో సంతానోత్పత్తి క్షీణతకు జీవనశైలి, జీవ సంబంధ వంటి అంశాలు కారణం అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 6 జంటల్లో ఒకరికి లైఫ్ స్టైల్ పిల్లల పుట్టుకపై ప్రభావం చూపిస్తుంది. భారతీయ స్త్రీలు ఇతరులతో పోలిస్తే, సంతానోత్పత్తి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు, అండాశయ పనితీరులో వేగవంతమైన క్షీణతను అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది.

పురుషుల్లో తక్కువ స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ మొటిలిటీ, స్పెర్మ్ ఆకారం వంటి సమస్యలు సంతానోత్పత్తికి ఆటంకం కలిగిస్తున్నాయి. మహిళల్లో హర్మోన్ల అసమతుల్యత, గర్భాశయ లేదా ఫెలోపియన్ ట్యూబ్స్, పీసీఓడీ వంటి సమస్యలు సంతాన లేమికి కారణాలుగా ఉన్నాయి. థైరాయిడ్ సమస్య కూడా మహిళల్లో ప్రభావం చూపిస్తోంది.

40 ఏళ్లు దాటిన పురుషుల్లో స్పెర్మ్ నాణ్యతకు సంబంధించి సమస్యలు చాలా సాధారణం. ఈ విషయం సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం కూడా ఓ సమస్య. జీవనశైలిలో ధూమపానం, అధిక మద్యపానం, కాలుష్యం, ఊబకాయం, మధుమేహ వంటి అంశాలు స్పెర్మ్ నాణ్యతను తగ్గిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో వర్క్‌ఫోర్సులో మహిళలు ఎక్కువగా భాగస్వామ్యం అవడం కూడా సంతానోత్పత్తి తగ్గడానికి సామజిక ఆర్థిక కారణాల్లో ఒకటి.