NTV Telugu Site icon

India as Vishwa Guru again: ఇండియా మళ్లీ విశ్వ గురువు కావాలనే భావన.. ప్రతి భారతీయుడి హృదయ స్పందన..

India As Vishwa Guru Again

India As Vishwa Guru Again

India as Vishwa Guru again: ప్రపంచంలో ఎన్నో గొప్ప నాగరికతలు విలసిల్లాయి. అందులో కొన్ని చరిత్రలో కలిసిపోగా మరికొన్ని కాల పరీక్షలకు సమర్థంగా ఎదురీది నిలబడ్డాయి. అలాంటి పటిష్ట నాగరికత గల నేల భారతదేశం. వేద కాలంలోనే వసుధైక కుటుంబ భావనను ప్రపంచానికి అందించింది. మన దేశంలోని వైవిధ్యాన్ని చూసి ప్రపంచ విజ్ఞులు దీన్నొక ఉపఖండమని ఎప్పటినుంచో కీర్తిస్తున్నారు. ఖండాలంటే వివిధ శీతోష్ణస్థితులు, భిన్న నైసర్గిక స్వరూపాలు, పలు జాతుల ప్రజలు, మతాలు, భాషలు, ఆహార అలవాట్లు, వాతావరణ పరిస్థితుల ఆధారంగా తమదైన జీవన విధానాలను కలిగి ఉంటాయి. భౌగోళికంగా, సామాజికంగా, చారిత్రకంగా, రాజకీయంగా భారతదేశం ప్రపంచంలో ఏ దేశానికీ లేని ఖండ లక్షణాలను కలిగి ఉంది.

‘ఫ్రీడం’ ఫౌండేషన్‌

మన దేశాన్ని రెండు వందల ఏళ్లపాటు అన్ని విధాలా పీల్చి పిప్పి చేసిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు 1947లో స్వాతంత్ర్యం ప్రకటించే ముందు అవహేళనగా కొన్ని ప్రకటనలను అవలీలగా చేశారు. ఇంతటి విభిన్నమైన దేశాన్ని పరిపాలించాలంటే అది తమకే సాధ్యమంటూ అహాన్ని ప్రదర్శించారు. మనం అత్యాశకు పోయి స్వాతంత్య్రాన్ని కాంక్షిస్తున్నామని ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్యం రాగానే దేశాన్ని ముక్కలు చెక్కలు చేసుకుంటామంటూ తక్కువ చేసి మాట్లాడారు. కానీ ఆ అంచనాలను నాటి మన జాతీయ నాయకులు పటాపంచలు చేశారు. ప్రపంచం అబ్బురపడేలా దేశాన్ని ముందుండి నడిపారు. స్వాతంత్ర్యమే జీవిత పరమార్థంగా, దేశ సమైక్యతే భారత జాతి జీవనాడిగా నిలబడ్డారు. జాతీయ భావనకు దృఢమైన పునాదులు వేశారు.

Azadi ka amrit mahotsav: భారతదేశ చరిత్రలో మరపురాని ఘట్టం.. స్వాతంత్ర్య అమృత మహోత్సవం..

విజయాలకు ఉదాహరణలు

చేతులకు పది వేళ్ల లాగా ఒకే భూభాగంలో పది మతాలు, ఈ నేలపై పరుగులు తీస్తున్న నదులు, ఉప నదుల్లాగ ఎన్నో భాషలు, మాండలికాలు, వటవృక్షానికి కొమ్మలు, ఉపకొమ్మల మాదిరిగా కులాలు, ఉప కులాలు కలసికట్టుగా ఉంటున్నాయి. హేళన చేసిన నోళ్లు మూతపడేలా భిన్నత్వంలో ఏకత్వమంటే ఏంటో చాటాయి. మన ప్రజాస్వామ్య సంస్థలైన ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ, శక్తివంతమైన మీడియా, చైతన్యవంతమైన పౌర సమాజం దేశంలో సుపరిపాలన కింది స్థాయి వరకు విస్తరించి ఉన్నాయనటానికి నిదర్శనం. స్వతంత్ర భారతావని సాధించిన గొప్ప విజయాల్లో ఇదొకటి. రోడ్లు, రైల్వేల్లో మౌలిక సదుపాయాల వృద్ధి, టెలికం, సాంకేతికత, ఆర్థిక సేవల రంగాల్లో అనూహ్యమైన పురోగతి స్వాతంత్ర్యానంతర భారత ఆర్థిక వ్యవస్థ విజయాల్లో అతిముఖ్యమైనవి.

ఛాలెంజింగ్‌..

ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ఒకే జాతి, ఒకే మతం, ఒకే భాషను అనుసరించే ప్రజలు తమలోతాము ఇమడలేక, తమనుతాము అర్థంచేసుకోలేక స్వజాతి హననాలకు స్వయంగా పాల్పడుతున్నారు. అభివృద్ధిలో వెనకబాటుకు, సామాజిక తిరోగమనానికి కారణమవుతున్నారు. ఐక్యరాజ్యసమితి గడప వద్ద అపరిష్కృత సమస్యల్లా మిగిలి ఉన్నారు. భారతదేశం మాత్రం కాలం పెట్టిన అగ్నిపరీక్షలను తట్టుకొని మేలిమి బంగారంలా మెరుస్తోంది. తన ఉనికిని ఘనంగా చాటుతూ దేశ అంతర్గత, బాహ్య స్వార్థ శక్తులకు, శత్రు మూకలకు బలమైన సవాలును విసురుతూనే ఉంది. ఈ 75 వసంతాల్లో అద్భుత విజయాలను సాధించింది. వైద్యంలో ప్రపంచం నాడిని ఇట్టే పట్టేసింది. విద్యలో విశ్వవ్యాప్తంగా పేరెన్నికగన్నది. రక్షణ రంగంలో సైన్యం తిరుగులేని శక్తిగా అవతరించింది.

అన్నపూర్ణగా పెద్ద మనసు

బెంగాల్ క్షామం వంటి దుర్భర పరిస్థితుల్లో స్వాతంత్ర్యాన్ని పొంది ఆకలితో అలమటించిన భారతదేశం నేడు అన్నమో రామచంద్రా అంటున్న దేశాలను ఆదుకొంటున్న మదర్‌ ఇండియాలా పెద్ద మనసును ప్రదర్శిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే అని పొగరుగా తలెగరేసిన రోదసీ దేశాల సరసన చేరింది. ఉపగ్రహాలను గగనతల కక్ష్యలోకి పంపించడమేకాక ఇతర దేశాలు తమ ఉపగ్రహాలను సైతం మన ద్వారా అంతరిక్షంలోకి పంపించే స్థాయికి ఎదిగింది. చంద్రయాన్, మంగళ్‌యాన్‌లను విజయవంతంగా పూర్తిచేసి విశ్వ రహస్యాలను ఛేదించడంలో ముందు వరుసలో ఉంది. దేశమంతా ఆనందోత్సాహాలతో స్వాతంత్ర్య వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న ఈ తరుణంలో భారతదేశం మరోసారి విశ్వ గురువుగా నిలవాలన్న ఆకాంక్ష పౌరులందరి మనసుల్లోనూ ఉంది.

ఆత్మాభిమానానికి అద్దం

ఇండియా మళ్లీ విశ్వ గురువుగా మారాలనే భావనపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఒక వైపు.. దేశ సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న హెచ్చుతగ్గులు ఆలోచనాపరులను కలవరపెడుతున్నాయి. మరో వైపు.. స్పేస్‌, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో దూసుకుపోతున్నందుకు గర్వంగానూ ఉంది. విశ్వ విజ్ఞాన ప్రదాత కావాలన్న ప్రగాఢ కోరిక ప్రతిఒక్క భారతీయ హృదయంలో ఉంది. కానీ.. నేటి ప్రపంచ దేశాలు వాటి పరిమాణంతో సంబంధంలేకుండా వివిధ రంగాల్లో గణనీయంగా అభివృద్ధిని సాధిస్తున్నాయి. ఆ అభివృద్ధి యాదృచ్ఛికంగా జరిగిన మార్పు కాదు. సమాజాలు, నేపథ్యాలు, ప్రజల ఆలోచన, ప్రభుత్వ విధానాలు వాటిని ఆ స్థాయికి తీసుకొచ్చాయి. అయితే అవన్నీ రాజకీయ స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధి, సాంకేతిక విజయాలకు సంబంధించినవి. విశ్వానికి సామాజిక స్ఫూర్తినందించేవి కావు.

అణువణువునా అణుకువ

ఆయా దేశాల అభివృద్ధితో పోల్చుకుంటే మనం ఇంకా ఎక్కువే పురోగతి సాధించాం. అయినప్పటికీ మనకు మనమే విశ్వగురువుగా ప్రకటించుకోవటం సముచితంకాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ భావనను ఆత్మాభిమానంగా భావించేవారు చాలా మంది ఉన్నారు. నేడు 76వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరువుకుంటున్న మన దేశానికి ప్రాచీన వారసత్వం ఉంది. అతిప్రాచీన నాగరికత నేపథ్యం ఉంది. శాస్త్ర, సాంకేతిక అంశాల్లో ప్రావీణ్యం ఉంది. అద్భుతమైన పరిపాలన వ్యవస్థ ఉంది. అత్యద్భుతమైన జనబాహుళ్యం ఉంది. ఇవే మన భారతావనిని సగర్వంగా విశ్వగురువు అని పరోక్షంగా ప్రకటిస్తున్నాయి.

స్వయంకృషితో ఋషి స్థానంలో

అంతర్జాతీయ సమాజం అంతుబట్టని గిల్లికజ్జాలతో సతమతవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియా ఓ జాతిగా ఐక్యంగా ఉండి ప్రపంచ దేశాలకి అనుభవపూర్వక పాఠాలు చెబుతూ ఎవరెస్టు శిఖరమంత విశ్వ గురు స్థానాన్ని ఎప్పుడో అధిరోహించింది. ఆధునిక, అధునాతన సమాచార, సాంకేతికతని అందిపుచ్చుకొని మూడు దశాబ్దాలుగా ఈ రంగాలని శాసిస్తూ ప్రపంచ దేశాలన్నింటికీ సాంకేతిక గురువు కూడా అయింది. ప్రపంచంలోని సమస్త తాత్వికతలకు నెలవైన భారతదేశం సంకుచిత తత్వంలో కునారిల్లుతున్న దేశాలకు సరికొత్త తాత్వికతను నేర్పుతూ ఋషి స్థానంలో నిలిచింది.