Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..

  • సాహిల్ వాకోడే కేసులో కీలక పరిణామం..
  • ఎగ్జామ్ హాల్‌లో ప్రశ్నించి, బయటకు పంపుతున్న దృశ్యాలు రికార్డ్..
  • పరీక్షా హాల్, కారిడార్లు, క్యాంపస్, హాస్టల్ సీసీటీవీలను పరిశీలిస్తున్న అధికారులు..
Iit Bombay Case

Iit Bombay Case

Sahil Wakode Death:  ఐఐటీ బొంబాయి విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. పరీక్షా సమయంలో ఎగ్జామ్ హాల్‌‌లో మొబైల్ ఉపయోగించాడనే ఆరోపణలపై అతడిని ప్రశ్నించి, బయటకు పంపుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. పరీక్షాహాలులోని సీసీటీవీ ఫుటేజ్‌ను ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. సెప్టెంబర్ 18న సాహిల్ సుమారు 12.30 నుంచి 12.45 గంటల మధ్య పరీక్షాహాలులో సాహిల్‌ను ప్రశ్నిస్తున్నట్లు, ఆ తర్వాత బయటకు వెళ్లిన వీడియో వెలుగులోకి వచ్చింది. చుట్టుపక్కల కారిడార్లలో అమర్చిన కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

హాస్టల్ వరకు సాహిల్ కదలికలపై దర్యాప్తు..

పరీక్షా కేంద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత సాహిల్ ఎక్కడకు వెళ్లాడు.? ఎవరిని కలిశాడు? అనే కోణంలో క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు సాగిస్తోంది. క్యాంపస్‌లో వివిధ ప్రాంతాల్లో, హాస్టల్ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ దృశ్యాలను సేకరించి, అతడి కదలికల్ని క్షుణ్ణంగా విచారిస్తున్నారు. దర్యాప్తులో ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. సాహిల్ మధ్యాహ్నం 1.25 గంటలకు హాస్టల్ గదికి చేరుకున్నట్లుగా తేలింది.

సంచలనంగా మారిన సాహిల్ మృతి..

ఐఐటీ బాంబేలో ఎనర్జీ అండ్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న సాహిల్ సెప్టెంబర్ 18న తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై క్యాంపస్‌లోని విద్యార్థులు అంతా నిరసన తెలిపారు. కుల వివక్ష, వేధింపుల కారణంగానే సాహిల్ మరణించాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ఇంకా రుజువు కాలేదు. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

పరీక్షా సమయంలో మొబైల్ ఉపయోగించి, ప్రశ్నా పత్రాన్ని చాట్‌జీపీటీకి పంపించిన, సమాధానాలు పొందాలని చూశాడని తొలుత ఐఐటీ బాంబే ప్రకటించింది. అయితే, దీనిపై తర్వాత క్షమాపణలు చెబుతూ.. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ ఘటనకు సంబంధించి తాము వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పింది. ప్రస్తుతం సీసీటీవీలో సాహిల్‌ను ప్రశ్నించి అక్కడి నుంచి బయటకు పంపుతున్న దృశ్యాలు ఉన్నాయి.

ప్రొఫెసర్ దూల్లాకు ఉపాధ్యాయుల మద్దతు..

పరీక్ష ఇన్విజిలేటర్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లాకు ఐఐటీ బాంబే ఫ్యాకల్టీ ఫోరం మద్దతు తెలిపింది. అకడమిక్ మాల్ ప్రాక్టీస్ ను గుర్తించిన తర్వాత, సంస్థ నిర్దేశిత విధానాన్ని దూల్లా పాటించారని స్పష్టం చేసింది. స్వతంత్ర దర్యాప్తుకు వీలు కల్పించేందుకు దూల్లాను డీన్ (అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్) బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పించినట్లు ఫోరం తెలిపింది. ఆయనకు మద్దతుగా క్యాంపస్‌లో మార్చ్ నిర్వహించనున్నట్లు కూడా ప్రకటించింది.