NTV Telugu Site icon

IC 814 hijacking: ‘‘IC 814: ది కాందహార్ హైజాక్’’.. దేశాన్ని కుదిపేసిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ హైజాక్ ఘటన..

Indian Airlines

Indian Airlines

IC 814 hijacking: ఇండియన్ ఎయిర్‌లైన్ ఖాట్మాండూ-ఢిల్లీ IC 814 విమానం హైజాక్‌ని దేశం ఇప్పటికి మరిచిపోలేదు. ఈ ఘటన 7 రోజుల పాటు యావత్ దేశాన్ని తీవ్ర గందరగోళానికి గురిచేసింది. ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌కి తీసుకెళ్లారు. ప్రయాణికుల్ని కాపాడేందుకు అప్పటి అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం భయకరమైన ఉగ్రవాది మసూద్ అజార్‌తో సహా ముగ్గుర ఉగ్రవాదుల్ని విడుదల చేయాల్సి వచ్చింది.

ఈ హైజాకింగ్ ఘటన ఆధారంగా నెట్‌ఫ్లిక్స్‌లో ‘IC 814: ది కాందహార్ హైజాక్’ సిరీస్ రూపొందించారు. హైజాకింగ్ సమయంలో ఫ్లైట్ కెప్టెన్‌గా ఉన్న దేవీ శరణ్ బుక్ ‘‘ఫ్లైట్ ఇన్‌టూ ఫియర్’’ ఆధారంగా ఈ సిరీస్ రూపొందించబడింది. నసీరుద్దీన్ షా, విజయ్ వర్మ, పంకజ్ కపూర్ వంటి వారు ఇందులో నటించారు.

అసలేం జరిగింది:

1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఐసీ 814 విమానం నేపాల్ రాజధాని ఖాట్మాండు నుంచి ఢిల్లీకి సాయంత్రం బయలుదేరింది. డిసెంబర్ 24న క్రిస్మస్ పండగతో ప్రపంచం అంతా సందడిగా ఉన్న సమయంలో విమానం హైజాక్ సంచలనంగా మారింది. ఫ్లైట్‌లో ప్రయాణికులు ముసుగులో ఎక్కిన ఐదుగురు హైజాకర్లు విమానాన్ని హైజాక్ చేశారు. కెప్టెన్‌ దేవీ శరణ్‌తో పాటు ఇతర సిబ్బందికి గన్స్ గురిపెట్టి విమానాన్ని ఆఫ్ఘనిస్తాన్ తీసుకెళ్లాలని అనుకున్నారు.

అయితే, ఢిల్లీ లేదా అమృత్‌సర్ వరకు ప్రయాణించేందుకే విమానంలో ఇంధనం ఉండటంతో విమానాన్ని అమృత్‌సర్‌లో ల్యాండ్ చేశారు. ఈ సమయంలోనే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఏస్‌జీ) కమాండోలను అక్కడికి తరలించి, రెస్క్యూ ఆపరేషన్ చేయాలని భావించారు. అయితే, హైజాకర్లు మాత్రం ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ చేస్తారనే అనుమానంతో ఫ్లైట్‌లో ఇంధనం త్వరగా నింపాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఎన్‌ఎస్జీ కమాండోలను అక్కడికి తరలించేందు గంటకు పైగా సమయం పడుతుందని, పంజాబ్ పోలీస్ కమాండోలను ఆపరేషన్ నిర్వహించాలని కోరారు. అయితే, ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. ఫ్లైట్ భారత భూభాగంలో 55 నిమిషాలు ఉన్నప్పటికీ ఏం చేయలేకపోయారు. ఏదో జరుగుతుందని అనుమానించిన టెర్రరిస్టులు ఫ్లైట్‌ని టేకాఫ్ చేయాలని బలవంతం చేశారు.

లాహోర్‌లో హైడ్రామా:

అమృత్‌సర్ నుంచి పాకిస్తాన్ లాహోర్‌ దగ్గర విమానాశ్రయం. ఫ్లైట్‌లో కేవలం అరగంటకు మాత్రమే సరిపోయే ఇంధనంతో లాహోర్ వైపు ఐసీ 814 వెళ్లింది. ఆ సమయంలో పాకిస్తాన్‌లో ముషరఫ్ సర్కార్ ఉంది. ముందుగా ఫ్లైట్ తమ భూభాగంలో ల్యాండ్ అయ్యేందుకు పాకిస్తాన్ అథారిటీ అనుమతి ఇవ్వలేదు. మొత్తం ఎయిర్‌పోర్ట్ నావిగేషన్ లైట్లను ఆర్పేసింది. అయితే, ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటడంతో చివరకు అనుమతిని ఇచ్చి, ఇంధనాన్ని నింపింది.

లాహోర్ టూ దుబాయ్:

నిజానికి హైజాకర్లు విమానాన్ని ఆఫ్ఘనిస్తాన్ కాబూల్‌లో దించాలని కోరారు. అయితే, ఆ సమయంలో అక్కడ నైట్ ల్యాండింగ్ సౌకర్యం లేకపోవడంతో విమానాన్ని దుబాయ్‌కి తరలించారు. యూఏఈ అధికారులు కోరడంతో విమానంలోని మహిళల్ని, పిల్లల్ని విమానం నుంచి దించేశారు. అయితే, దీనికి ముందు హైజాకర్లలో ఒకరైన జహూర్ మిస్త్రీ చేత చంపబడిన 25 ఏళ్ల రూపిన్ కత్యాల్ మృతదేహాన్ని అక్కడే దించారు.

దుబాయ్ టూ కాందహార్.. ఉగ్రవాదుల విడుదల డిమాండ్:

దుబాయ్ నుంచి విమానాన్ని కాందహార్ తరలించారు. కాందహార్‌లో దిగగానే అప్పటి తాలిబాన్ సర్కార్, దాని ఉగ్రవాదులు విమానానికి రక్షణగా నిలిచారు. తాలిబాన్ విదేశాంగ మంత్రి అబ్దుల్ వకీల్ ముఫవాకిల్ కాందహార్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి హైజాకర్ల డిమాండ్లను చెప్పారు. 200 మిలియన్ డాలర్ల డబ్బుతో పాటు 36 మంది ఖైదీలను విడుదల చేయాలని, ఖననం చేసిన ఉగ్రవాది మృతదేహన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వాజ్‌పేయి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి:

అప్పటికే భారత్ కార్గిల్ యుద్ధం చేసి కొన్ని నెలలే అయింది. మరోవైపు పోఖ్రాన్ అణుపరీక్షల నేపథ్యంలో అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాలు భారత్‌పై గుర్రుగా ఉన్నాయి. ఈ సమయంలోనే విమానం హైజాక్ వాజ్‌పేయి సంకీర్ణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా మారింది. హైజాకర్లు కోరిన ఉగ్రవాదుల్ని విడుదల చేసి, తమ వారిని విడిపించాలని ప్రయాణికుల బంధువులు డిమాండ్ చేశారు. అయితే, అప్పటి ప్రతిపక్షాలు జాతీయ ప్రయోజనాల్లో రాజీ పడొద్దని సర్కారుకి సూచించాయి.

అయిష్టంగానే భారత్, ఉగ్రవాదులతో చర్చలు ప్రారంభించింది. తాలిబాన్లు దీనికి మధ్యవర్తులుగా వ్యవహరించారు. చర్చల ఫలితంగా ముగ్గురు ఉగ్రవాదులు అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, మసూద్ అజార్, ముస్తాక్ అహ్మద్ జర్గార్ విడుదలయ్యారు. అప్పటి విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ డిసెంబర్ 30 సాయంత్రం ఆఫ్ఘనిస్తాన్‌కి వెళ్లి డీల్‌ని పర్యవేక్షించారు. దాదాపు ఏడు రోజుల తర్వాత ఈ హైజాకింగ్ డ్రామా ముగిసింది.

2001లో భారత పార్లమెంటుపై దాడి, 2008 ముంబై దాడులు, 2019లో 40 మంది భద్రతా సిబ్బంది మరణించిన పుల్వామా దాడి వెనుక జైషే మహ్మద్‌ను మసూద్ అజార్ స్థాపించాడు. అహ్మద్ ఒమర్ సయీద్ షేక్ అనే అమెరికన్ జర్నలిస్ట్ డేనియల్ పెరల్ కిడ్నాప్ మరియు హత్య కేసులో అరెస్టయ్యాడు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్, ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చర్చల బృందంలో ఉన్నారు. ఈ ఘటన బీజేపీకి తీవ్ర ఎదురుదెబ్బగా మారింది.

Show comments