NTV Telugu Site icon

Board Exams: ఇంటర్‌ విద్యార్థులకు ఇకపై ఏటా రెండుసార్లు బోర్డు ఎగ్జామ్స్

Board Exams

Board Exams

Board Exams: జాతీయస్థాయిలో నూతన విద్యా విధానం రూపొందించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు పరీక్షల విధానంలోనూ మార్పులకు సిద్ధమైంది. ఇకపై జాతీయ బోర్డుల అధ్వర్యంలో కొనసాగే ఇంటర్మీడియట్‌ పరీక్షలను ఇకపై ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి నూతన కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌సీఎఫ్‌) ప్రతిపాదనలను రూపొందించింది. భారతీయ భాషలు తప్పనిసరిగా చదవాలని, 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు కనీస సబ్జె్క్టులను పెంచాలని ఎన్‌సీఎఫ్‌ సూచించింది. ఎన్‌సీఎఫ్‌ రూపొందించిన మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ బుధవారం జాతీయ విద్య పరిశోధక శిక్షణా మండలి(ఎన్‌సీఈఆర్‌టీ)కి పంపించారు. ఎన్‌సీఎఫ్‌ను ఇస్రో మాజీ చైర్మన్‌ కస్తూరిరంగన్‌ నేతృత్వంలోని జాతీయ స్టీరింగ్‌ కమిటీ రూపొందించింది. బోర్డు పరీక్షల్లో సంస్కరణలు తొలిసారి కాదు. 2009లో 10వ తరగతిలో ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)’ విధానాన్ని ప్రవేశపెట్టగా.. 2017లో రద్దుచేసి తిరిగి వార్షిక పరీక్షల విధానాన్ని తీసుకొచ్చారు.

Read Also: Patnam Mahendar Reddy: నేడే పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. ఏశాఖ ఇవ్వనున్నారు?

ప్రతి ఏడాది బోర్డు పరీక్షలను రెండు సార్లు నిర్వహించడం వల్ల ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులు ఏ పరీక్షలో అయితే ఉత్తమ మార్కులు సాధిస్తారో వాటినే ఎంచుకునే అవకాశం ఉంటుందని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఏటా రెండుసార్లు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసే అవకాశం ఉంటుందని పేర్కొంది. క్రమక్రమంగా అన్ని బోర్డులు కూడా సెమిస్టర్‌ లేదా టర్మ్‌ బేస్డ్‌ వ్యవస్థకు మారతాయని కేంద్ర విద్యాశాఖ స్పష్టంచేసింది. దీనివల్ల విద్యార్థులు ఒక సబ్జెక్టును పూర్తిచేయగానే అతడు పరీక్ష రాయొచ్చని, ఇలా ఒక పరీక్ష పూర్తయినా విద్యార్థిపై కంటెంట్‌ భారం తగ్గుతుందని విద్యాశాఖ స్పష్టం చేసింది. 9, 10 తరగతుల విద్యార్థులు ఇకపై కచ్చితంగా మూడు లాంగ్వేజ్‌ సబ్జెక్టులు చదవడం తప్పనిసరని అని ఎన్సీఎఫ్‌ ప్రతిపాదనల్లో పేర్కొంది. మూడు లాంగ్వేజ్‌లతోపాటు మ్యాథ్స్, కంప్యూటేషనల్‌ థింకింగ్, సోషల్‌ సైన్స్, సైన్స్, ఆర్ట్‌ ఎడ్యుకేషన్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, వెల్‌–బియింగ్, వొకేషనల్‌ ఎడ్యుకేషన్‌ వంటి ఏడు సబ్జెక్టులు చదవాల్సి ఉంటుందని ఎన్‌సీఎఫ్‌ ప్రతిపాదనల్లో పేర్కొంది.