Site icon NTV Telugu

Har ghar Tiranga: ఇంటింటా మువ్వన్నెల జెండా.. దేశభక్తి గుండెల నిండా..

Har Ghar Tiranga

Har Ghar Tiranga

Har ghar Tiranga: మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఆగస్టు 15 నాటికి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్న నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమాన్ని కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయటానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 20 కోట్ల ఇళ్ల పైన మువ్వన్నెల జెండాను సగర్వంగా ఎగరేయటానికి ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే (ఆగస్టు) నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ జాతీయ పండగను కన్నుల పండుగగా చేపట్టాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దేశ ప్రజలందరినీ కోరారు.

ఈ మేరకు ఆయన నిన్న అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఏర్పాటుచేస్తున్న ఈ హర్‌ ఘర్‌ తిరంగా ప్రోగ్రామ్‌లో రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వరంగ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్‌ కంపెనీలు, కోపరేటివ్‌ సొసైటీలు ఇలా అన్ని యంత్రాంగాలూ పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విశేష వేడుక పౌరుల్లో మరోసారి దేశభక్తిని, జాతీయ భావాన్ని రగిలించాలని చెప్పారు.

దేశ స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన ఎంతో మంది వీరుల స్ఫూర్తిని హర్‌ ఘర్‌ తిరంగా ద్వారా చిన్నారుల్లో, యువతలో నింపాలన్నారు. ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ‘ప్రభాత్‌ ఫెరీలు’ జరపాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సూచించారు. స్వాతంత్ర్య పోరాటంలో ఇవి కీలక పాత్ర పోషించాయని, స్వదేశీ ఉద్యమం, క్విట్‌ ఇండియా మూమెంట్‌, సహాయ నిరాకరణ వంటి కార్యక్రమాలు సక్సెస్‌ అవటానికి భూమికగా నిలిచాయని కేంద్ర హోం మంత్రి గుర్తుచేసుకున్నారు.

read more: Presidents of India List : భారత గత రాష్ట్రపతులు వీరే..

ఈ నెల 22 నుంచి అన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లలో, హోం పేజీల్లో త్రివర్ణ పతకాల ఇమేజ్‌లని డిస్‌ప్లే చేయాలని కోరారు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సోషల్‌ మీడియాల్లో అకౌంట్లు ఉన్న అందరూ ఈ మూడు రంగుల జెండాను ముచ్చటగా సెట్‌ చేసుకోవాలని సూచించారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ అడ్వర్టైజ్‌మెంట్లలో “హర్‌ ఘర్‌ తిరంగా” ఇనీషియేటివ్‌కి విస్తృత ప్రచారం కల్పించాలని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్‌ మీడియా ముఖ్యంగా లోకల్‌ ఛానల్స్‌ సైతం ఈ కార్యక్రమాన్ని యాక్టివ్‌గా చేపట్టాలని చెప్పారు.

ఇప్పటికే పెద్దఎత్తున కొనసాగుతున్న “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్”లో హర్‌ ఘర్‌ తిరంగా ఒక మైలురాయిగా నిలవాలని అమిత్‌షా ఆకాంక్షించారు. హర్‌ ఘర్‌ తిరంగాను మూడు దశల్లో చేపట్టాలని స్పష్టం చేశారు. ఒకటో దశలో భారీఎత్తున ప్రచారం నిర్వహించి పౌరులందరినీ పాలుపంచుకునేలా చేయటం, రెండో దశలో జాతీయ జెండాలను సరిపోను సంఖ్యలో తయారుచేయించటం, మూడో దశలో ఆ పతాకాలను ప్రతి ఇంటి మీదా ఎగరేయటం అని వివరించారు. ఫ్లాగ్స్‌ తయారీకి ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసిందని, పోస్టాఫీసుల్లో ఆర్డర్లు పెట్టి జెండాలు తీసుకోవచ్చని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వెల్లడించారు.

Exit mobile version