Shivling: శివరాత్రి పండగకు ముందు గుజరాత్‌లోని ద్వారకలోని ఒక ఆలయం నుంచి శివలింగం దొంగతనానికి గురైంది. ఈ వార్త సంచలనంగా మారడంతో, అధికారులు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారించారు. దర్యాప్తు సమయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుజరాత్‌కి చెందిన ఒక కుటుంబం ఫిబ్రవరి 26న మహా శివరాత్రి సందర్భంగా, తమ ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించాలని దొంగిలించినట్లు తేలింది. ఈ కేసులో కుటుంబంలోని 8 మందిని అరెస్ట్ చేశారు.
అయితే, తమ కుటుంబంలోని ఒక అమ్మాయికి కల రావడంతోనే దొంగతనానికి పాల్పడినట్లు నిందితులు చెప్పారు. ద్వారకలోని హర్షద్‌లోని పురాతన భీద్భంజన్ మహాదేవ్ ఆలయం నుండి శివలింగం దొంగిలించబడిన తర్వాత, అధికారులు మొదట దానిని సముద్రంలో విసిరివేసినట్లు అనుమానించారు. దర్యాప్తులో, ద్వారకకు 500 కి.మీ దూరంలోని సబర్కాంత జిల్లాలోని హిమ్మత్ నగర్‌కి చెందిన ఒక కుటుంబం దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు.
Read Also: Trump Zelensky: ట్రంప్, జెలెన్ స్కీ మధ్య వాగ్వాదం.. వైట్‌హౌజ్ సమావేశంలో రచ్చ..
ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా, ఆ కుటుంబంలోని ఒక అమ్మా్యికి కల వచ్చిందని, అందులో భీద్బంజన్ మహాదేవ్ ఆలయంలోని శివలింగాన్ని ఇంటికి తీసుకువచ్చి ప్రతిష్టించడం వల్ల వారి సమస్యలు తొలిగిపోయి, మంచి జరుగుతుందని కుటుంబం నమ్మిందని తేలింది. మహేంద్ర మక్వానా అనే వ్యక్తి మేనకోడలుకు వచ్చిన కల ఆ కుటుంబాన్ని శివలింగాన్ని దొంగిలించడానికి ప్రేరేపించింది. దొంగతనం చేయడానికి, ఏడు నుండి ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ద్వారకకు ప్రయాణించి కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. వారు ఆలయాన్ని సందర్శించి, శివలింగాన్ని దొంగిలించిన తర్వాత, ఇంటికి తిరిగి వచ్చి మహాశివరాత్రి నాడు దానిని వారి ఇంట్లో ప్రతిష్టించారు.
ఈ కేసులో మహేంద్రతో పాటు కుటుంబంలోని ముగ్గురు మహిళలతో పాటు వనరాజ్, మనోజ్, జగత్ అనే ఇతర నిందితులను కూడా అరెస్టు చేసినట్లు ద్వారక ఎస్పీ నితీష్ పాండే చెప్పారు. దొంగిలించిన శివలింగాన్ని స్వాధీనం చేసుకుని, ద్వారకలోని ఆలయంలో తిరిగి ప్రతిష్టించారు.