NTV Telugu Site icon

Great and Good News: అరుణాచల్‌ప్రదేశ్‌కే కాదు.. దేశం మొత్తానికీ గ్రేట్‌ న్యూస్‌, గుడ్‌ న్యూస్‌

Great And Good News

Great And Good News

Great and Good News: మన దేశంలో అరుణాచల్‌ప్రదేశ్‌కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌ అంటే “ఉదయించే సూర్యుని భూమి” అని అర్థం. ఆ రాష్ట్ర చరిత్రలో మరికొద్ది రోజుల్లో నూతన అధ్యాయం ప్రారంభంకానుంది. దీంతో అరుణాచల్‌ప్రదేశ్‌ అసలైన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’ జరుపుకోనుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్నా ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్క విమానాశ్రయం కూడా లేకపోవటం పెద్ద లోటుగా అనిపించేది.

అయితే ఆ సుదీర్ఘ ఎదురుచూపులకు వచ్చే ఆగస్టు 15వ తేదీతో తెరపడబోతోంది. సొంత ఎయిర్‌పోర్ట్‌ కోసం ఆ రాష్ట్రం ఇన్నాళ్లూ కన్న కల నిజం కానుంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో తొలి విమానాశ్రయం ప్రారంభంకానుంది. ఆ విమానాశ్రయం పేరు.. హోలోంగి ఎయిర్‌పోర్ట్‌. అక్కడి నుంచి ఆగస్టు 15న విమానాల రాకపోకలు ఆరంభం కానున్నాయి. ఈ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌.. రాష్ట్ర రాజధాని ఇటానగర్‌కి 15 కిలో మీటర్ల సమీపంలోనే ఉండటం గమనార్హం.

read more: Hyderabad: మసీదులో ఉచిత డయాలసిస్ కేంద్రం. ప్రపంచంలోనే తొలిసారి!

అయితే ఇది ఆ రాష్ట్రానికే గ్రేట్‌ అండ్‌ గుడ్‌ న్యూస్‌ కదా.. దేశం మొత్తానికి ఎందుకు అనే ప్రశ్న తలెత్తొచ్చు. దీనికి ఒక ప్రధాన కారణం ఉంది. అరుణాచల్‌ప్రదేశ్‌ భౌగోళికంగా, ప్రకృతిపరంగా అందమైన రాష్ట్రం. పూదోటల స్వర్గం. మంచుతో కూడిన పర్వతాలు, సహజ లోయలు, తళుక్కున మెరిసే ప్రవాహాలు, బౌద్ధ సన్యాసులు పఠించే శ్లోకాలు, వైవిధ్య వృక్ష, జంతుజాలాలతో పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించే ప్రాంతం.

ఇన్నాళ్లూ ఈ రాష్ట్రానికి టూరిస్టులు వెళ్లాలంటే రకరకాల మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చేది. అటూ ఇటూ తిరిగి అక్కడికి చేరుకునేవాళ్లు. ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్‌కి అతి దగ్గరలో ఉన్న విమానాశ్రయం ఏదంటే అస్సోంలోని నార్త్‌ లఖింపూర్‌ జిల్లా పరిధిలోకి వచ్చే లీలాబరి ఎయిర్‌పోర్టే అని చెప్పాలి. అదే రాష్ట్రంలోని గువాహటిలో ఉన్న లోక్‌ప్రియ గోపీనాథ్‌ బోర్డోలోయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ కూడా అరుణాచల్‌ప్రదేశ్‌కి సమీపంలోనే ఉంటుంది.

ఇవి రెండూ కూడా ఆ రాష్ట్రానికి తక్కువలోతక్కువ 80 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. దీంతో అక్కడి నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌కి వెళ్లాలన్నా, రావాలన్నా చాలా సమయం పట్టేది. బస్సెక్కి రోడ్డు మార్గంలో ప్రయాణించాలి. మరో పాతిక రోజుల్లో హోలోంగి ఎయిర్‌పోర్ట్‌ అందుబాటులోకి రానుండటంతో ఇక నుంచి డైరెక్ట్‌గా అరుణాచల్‌ప్రదేశ్‌కే వెళ్లొచ్చు. తద్వారా పర్యాటకులకు జర్నీ ఇబ్బందులు తప్పుతాయి. ఈ విమానాశ్రయాన్ని ఆధునిక సదుపాయాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

పీక్‌ అవర్స్‌లో సుమారు 200 మంది ప్రయాణికులకు సరిపోయే వసతి ఉంది. మొత్తం 8 చెక్‌-ఇన్‌ కౌంటర్లను ఏర్పాటుచేశారు. 2,300 కిలో మీటర్ల రన్‌వే ఉంది. బోయింగ్‌-747ని సైతం టేకాఫ్‌, ల్యాండింగ్‌ చేయొచ్చు. ఇన్నాళ్లూ ఎయిర్‌పోర్ట్‌ లేకపోవటంతో విజిటర్లు అరుణాచల్‌ప్రదేశ్‌కి రావాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించేవారు. అయినప్పటికీ ఆ రాష్ట్రం పర్యాటకులను బాగానే ఆకర్షిస్తోంది. ఇప్పుడు విమానాశ్రయం అందుబాటులోకి రానుండటంతో టూరిస్టుల సంఖ్య ఇంకా పెరుగుతుంది.