Site icon NTV Telugu

Pahalgam Terror Attack: బైసరన్‌ లోయపై కేంద్రం సంచలన ప్రకటన.. ఆ విషయమే తెలియదని వెల్లడి

Government

Government

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత గురువారం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆధ్వర్యంలో ఈ ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా పహల్గామ్‌లో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అఖిలపక్ష నేతలు విషయాన్ని లేవనెత్తారు. దీనిపై కేంద్ర పెద్దలు జోక్యం పుచ్చుకుని.. అసలు బైసరన్ లోయ తెరిచిన విషయమే తమకు తెలియదని పేర్కొన్నారు. స్థానిక అధికారులు తమకు సమాచారమే ఇవ్వలేదని కేంద్ర పెద్దలు చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్ బ్యూరోలోని ప్రత్యేక డైరెక్టర్ అఖిలపక్ష నేతలకు వివరణ ఇచ్చారు. భద్రతా దళాలకు సమాచారం ఇవ్వకుండానే ఏప్రిల్ 20న బైసరన్ లోయ తెరిచారని పేర్కొన్నారు. సాధారణంగా ఈ లోయ జూన్ నెలలో మాత్రమే అమర్‌నాథ్ యాత్రికుల కోసం తెరిచి ఉంటుందని.. అలాంటిది ఈ నెలలో ఎందుకు తెరిచారో తమకు తెలియదని ఆయన వివరించారు. స్థానిక అధికారులు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకుండానే తెరిచారని ప్రత్యేక డైరెక్టర్ నేతలకు వివరించారు. ఏప్రిల్ 22న ఉగ్ర దాడి జరిగిన సమయంలో అక్కడ భద్రతా సిబ్బంది లేరని ఆయన ఒప్పుకున్నారు. ఆ లోయ తెరిచిన విషయం తెలియకపోవడంతోనే ఇదంతా జరిగినట్లుగా చెప్పుకొచ్చారు.

దీనిపై ఎంపీ సుప్రియా సూలే స్పందిస్తూ. పూణెలో ఒక ట్రావెల్ ఏజెంట్.. బైసరన్ లోయ ఓపెన్ చేశారని చెప్పి.. అనేక మంది టూరిస్టులను అక్కడికి పంపించాడని గుర్తుచేశారు. ఒక ట్రావెల్ ఏజెంట్‌కే ఆ సమాచారం తెలిసినప్పుడు కేంద్రానికి ఎందుకు తెలియలేదని సుప్రియా సూలే ప్రశ్నించారు. అంతేకాకుండా రాహుల్‌గాంధీ కూడా స్పందిస్తూ భద్రతా వైఫల్యమని ఒప్పుకుంటున్నారా? అని అడిగారు. విపక్ష సభ్యులకు అధికారి సమాధానం ఇవ్వలేదు.

ఇంతలో ఒక సీనియర్ మంత్రి జోక్యం పుచ్చుకుని ఏదో ఒక సమస్య వచ్చింది కాబట్టే ఈ సమావేశం నిర్వహిస్తున్నామని.. ప్రస్తుతం భవిష్యత్ గురించి ఆలోచించాలని అన్నారు. ఇంతలో ఆప్‌కు చెందిన నేత కలుగజేసుకుని భద్రతా లోపం ఎందుకు జరిగిందో గుర్తించి… దానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తానికి అఖిలపక్ష నేతలంతా కేంద్రం తీసుకునే భవిష్యత్ చర్యలకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి.

అఖిలపక్ష భేటీకి కేంద్రమంత్రులు అమిత్ షా, జై శంకర్, నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా, కాంగ్రెస్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఇతరు పార్టీల నేతలంతా హాజరయ్యారు.

Exit mobile version