Gig Workers Strike: దేశవ్యాప్తంగా డిసెంబర్ 31న గిగ్ వర్కర్లు సమ్మె చేస్తున్నారు. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు చెందిన గిగ్ వర్కర్లు సమ్మెలోకి వెళ్తుండటంతో, న్యూ ఇయర్ వేడుకలపై ప్రభావం పడనుంది. ఏడాదిలో అత్యంత అమ్మకాలు జరిగే ఈ రోజే వర్కర్లు స్ట్రైక్ చేస్తుండటంతో కస్టమర్ల ప్రణాళికలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇయర్ ఎండ్ రెవెన్యూ టార్గెట్లను చేరుకోవడానికి డిసెంబర్ 31 డెలివరీలపై ఆధారపడే రిటైలర్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
సమ్మె ఎందుకు..?
తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) మరియు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (IFAT) ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో కొన్ని యూనియన్లు కూడా దీనికి మద్దతు ఇచ్చాయి. పని గంటలు పెరుగుతున్నప్పటికీ, ఆదాయం క్రమంగా తగ్గుతోందని కార్మికులు చెబుతున్నారు. ఉద్యోగ భద్రత లేకపోవడం, ప్రమాద బీమా, గౌరవం, భద్రత లేకపోవడం వంటి ప్రధాన ఆరోపణలు చేస్తున్నారు. భారత డిజిటల్ మార్కెట్‌కు వెన్నెముకగా నిలిచే డెలివరీ భాగస్వాములకు కంపెనీలు తగని ప్రాధాన్యత కల్పించడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
న్యూ ఇయర్ వేడుకలపై ప్రభావం:
గిర్ వర్కర్లు సమ్మెలో ఉండటంతో స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్‌కార్ట్, బ్లింకిట్ వంటి ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫారమ్స్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. వినియోగదారులు డెలివరీలు అందుకోలేకపోవచ్చు. గ్రాసరీ, ఫుడ్ డెలివరీలు దెబ్బతింటాయి. ఫుడ్ ఆర్డర్లు ఆలస్యం కావడం లేదా రద్దు కావడం వంటివి జరగొచ్చు. ఢిల్లీ, ముంబై, బెంగళూర్, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, పూణే వంటి మెట్రో నగరాలతో పాటు టైర్-2 నగరాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
వినియోగదారులు ఏం చేయాలి.?
కొత్త సంవత్సర వేడుకల ముందు డెలివరీ ప్లాట్‌ఫారమ్స్ ప్రయోషనల్ ఆఫర్స్‌ను అమలు చేస్తున్నాయి. కస్టమర్లు తమ ఉత్పత్తుల్ని నిల్వ చేసుకోవాలని సలహా ఇస్తున్నాయి. న్యూ ఇయర్ వేడుకలతో పాటు ఇతర అవసరాల కోసం వినియోగదారులు దగ్గర్లో ఉండే దుకాణాలను ఆశ్రయించడం బెటర్. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా అర్ధరాత్రి వరకు డైనమిక్ లేదా సర్జ్ ధరలకు కస్టమర్లు సిద్ధంగా ఉండాల్సి రావచ్చు. గతంలో కన్నా డిసెంబర్ 31 రోజున డెలివరీ సమయం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అత్యవసర వస్తువుల కోసం క్విక్ కామర్స్ యాప్‌లపై ఆధారపడకపోవడమే మంచింది.
