Floating Stone With Rama Name Found In Uttar Pradesh Mainpuri: మన ప్రపంచం ఎన్నో అద్భుతాలకు, చమత్కారాలు కొలువు. కొన్నింటికీ సమాధానాలు దొరికితే, మరికొన్ని మాత్రం మిస్టరీగానే మిగిలిపోయాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే రాయి.. రెండో కోవకి చెందిందే! రామాయణంలో సీత కోసం లంకకి వెళ్లే మార్గంలో రాముడు రాళ్లతో నిర్మించిన ‘రామసేతు’ గురించి విన్నాం గానీ, నీటిలో తేలియాడే ‘రామసేతు రాళ్లను’ ఎన్నడూ చూడలేదు. ఇప్పుడు ఆ చమత్కారం సాక్షాత్తూ కళ్లముందుకు వచ్చేసింది. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. నీటిలో తేలియాడే రాయి ఒకటి తాజాగా వెలుగు చూసింది.
ఆ రాయి ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిందో తెలీదు కానీ.. ఉత్తరప్రదేశ్ మెయిన్‌పురిలోని ఇషాన్ నదిలో అది ప్రత్యక్షమైంది. మొదట్లో దీనిని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఏదో అట్ట ముక్క అయ్యుంటుందిలే అని భావించారు. కానీ.. ఒడ్డుకి కొట్టుకొచ్చాక అది రాయి అని తెలిసి అందరూ షాకయ్యారు. మరో విషయం ఏమిటంటే.. ఆ రాయిపై ‘రామ’ అని హిందీలో రాయబడి ఉంది. దీంతో.. ఈ రాయి ‘రామసేతు’ వారధిలోనిదేనంటూ స్థానికులు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం తెలిసి, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వాళ్లందరూ తండోపతండాలుగా వచ్చి, ఆ రాయిని చూసి వెళ్తున్నారు. అంతేకాదు.. ఈ రాయిని ఆలయంలో ఉంచి స్థానికులు పూజలు జరుపుతున్నారు.
ఈ రాయి ఎలా తేలియాడుతోంది? ఇది నిజంగానే రామసేతు వారధిలోనిదినేనా? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకాల్సి ఉంది. పోనీ ఆ రాయి ఏమైనా తేలికగా ఉందా అంటే.. ఆరు కిలోల బరువు ఉంది. సాధారణంగా ఒక చిన్న రాయి వేస్తే, అది మునిగిపోతుంది. అలాంటి.. ఆరు కిలోల రాయి నీటిలో మునగకపోవడం నిజంగా చమత్కారమే! ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పెట్టగా.. అవి వైరల్ అవుతున్నాయి.
