NTV Telugu Site icon

Election Commission: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ఈసీ కీలక హెచ్చరిక..

Ec

Ec

Election Commission: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలు మర్యాదపూర్వకంగా, ఉత్తమంగా నడుచుకోవాలని సలహా ఇచ్చింది. బహిరంగ సభల్లో సంయమనం పాటించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా ఉండాలని సూచించింది. మోడల్ కోడ్‌ ఆఫ్ కాండక్ట్(ఎంసీసీ) ఉల్లంఘన విషయంలో పార్టీలు సీరియస్‌గా ఉండాలని చెప్పింది. ఎవరైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రత్యర్థులను దూషించే విధంగా, అవమానించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేయవద్దని అజ్వైజరీ జారీ చేసింది.

Read Also: Rameshwaram Cafe: రామేశ్వరం కేఫ్‌లో ఐఈడీ బ్లాస్ట్.. ధృవీకరించిన సీఎం సిద్ధరామయ్య..

దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వాలు మరేదైనా ప్రార్థనా స్థలంలో ఎన్నికల ప్రచారం కోసం వినియోగించవద్దని సూచించింది. గతంలో నోటీసలు అందుకున్న స్టార్ క్యాంపెనర్లు, అభ్యర్థులు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. ఈ నెలలో లోక్‌సభ మరియు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రకటనతో వస్తుందని భావిస్తున్న తరుణంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల పార్టీలు నైతిక, గౌరవప్రదమైన రాజకీయ ప్రసంగాలను ప్రోత్సహించాలని అన్నారు.

లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది. ఏప్రిల్-మేలో ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చి మధ్యలో ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వచ్చేశాయి. మరోవైపు ఎన్నికల నిర్వహణపై ఈసీ అధికారులు పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చకచక పూర్తి చేస్తోంది. ఇటీవల ఎన్నికల నిర్వహణ కోసం ఎంత మంది భద్రతా సిబ్బంది అవసరం అవుతారనే విషయంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నివేదిక అందించింది.