Crime News: రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలో సమాజం సిగ్గుపడేలా ఓ ఉదంతం వెలుగు చూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే పదేళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లో తల్లి లేని సమయంలో మద్యం మత్తులో కుమార్తెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బరన్ జిల్లాలో పదేళ్ల బాలికపై ఆమె తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు శుక్రవారం తెలిపారు. దినసరి కూలీగా జీవనం సాగిస్తు్న్న 33 ఏళ్ల నిందితుడిని గురువారం అరెస్టు చేసి శుక్రవారం జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు ఎస్‌హెచ్‌ఓ రాజేంద్ర కుమార్ మీనా తెలిపారు.
మంగళవారం నాడు ఆ వ్యక్తి మద్యం మత్తులో ఇంటికి తిరిగి వచ్చి 5వ తరగతి చదువుతున్న తన కూతురిపై అత్యాచారం చేశాడని, ఆమె తల్లి పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని రాజేంద్ర కుమార్ మీనా వెల్లడించారు. సాయంత్రం బాధితురాలి తల్లి తిరిగి రాగానే తనకు జరిగిన బాధను వివరించినట్లు ఆయన చెప్పారు. ఆ మహిళ బుధవారం తన కుమార్తెతో కలిసి పోలీసులను ఆశ్రయించి తన భర్తపై ఫిర్యాదు చేసినట్లు అధికారి తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం, వైద్య పరీక్షల ఆధారంగా నిందితులపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 376 (అత్యాచారం), పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. బాలిక తల్లిదండ్రులిద్దరూ దినసరి కూలీలు, తండ్రి తాగుడుకు అలవాటు పడ్డాడని విమరించారు.