Election Commission: కేంద్రం ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఈ రోజు నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారంలో రెడ్ లైన్ దాటొద్దని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘అన్ని రకాల ఉల్లంఘనలకు సంబంధించిన డేటా సేకరించిన తర్వాత మేము చివరి సలహా జారీ చేశాము, నియమావళి గురించి అన్ని రాజకీయ పార్టీలకు దృష్టికి తీసుకెళ్లాం. రాజకీయ పార్టీలు వీటికి సంబంధించిన మార్గదర్శకాలను స్టార్ క్యాంపెనర్లకు, అభ్యర్థులకు ఇవ్వాలని కోరాము’’ అని రాజీవ్ కుమార్ చెప్పారు. మార్గదర్శకాలను ప్రతీ స్టార్ క్యాంపెనర్ దృష్టికి తీసుకురావడం మా బాధ్యత అని అన్నారు.
Read Also: Family Star : షూటింగ్ ను పూర్తి చేసుకున్న ‘ ఫ్యామిలీ స్టార్ ‘.. విజయ్ స్పెషల్ పోస్ట్..
ఓటర్లను ప్రభావితం చేయడం, విద్వేషపూరిత ప్రసంగాలకు ప్రవర్తనా నియమావళి అడ్డుకట్ట వేస్తుంది. కులాలు, మతాల మధ్య ఉద్రిక్తతలను సృష్టించడాన్ని నిషేధిస్తుంది. అభ్యర్థులు తమ ప్రత్యర్థుల వ్యక్తిగత జీవిత అంశాలను విమర్శించకుండా అడ్డుకుంటుంది. ప్రజలను ప్రలోభపెట్టే చర్యలను నిలువరిస్తుంది. ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే అధికారం ఈసీకి ఉంది. ఓట్ల లెక్కింపు వరకు ఇది అమలులో ఉంటుంది. ఏప్రిల్ 19 నుంచి 7 దశల్లో జూన్ 1 వరకు లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి.