Dharampal alias Kala Recieved A Huge Gift From Villages After Lost In Elections: అదేంటి..? ఎన్నికల్లో ఓడిపోయినవాడు, భారీ బహుమానం ఎలా పొందాడు? అని అనుకుంటున్నారా! నమ్మశక్యం కాని ఈ పరిణామం హరియాణా రాష్ట్రంలోని రోహతక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవల చిరీ అనే గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేయడంతో.. ధర్మపాల్ అలియాస్ కాలా పోటీ చేశాడు. ఆ గ్రామంలో అతనికి మంచి పేరు ఉండటం వల్లే, స్వయంగా గ్రామస్థులు ఎన్నికల బరిలో నిలబడాలని కోరారు. వారి కోరికని తిరస్కరించలేక, కాలా పోటీ చేయడం జరిగింది. అయితే.. ఈ ఎన్నికల్లో ఆయన 66 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. తమ కోరిక మేరకు ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి ఓటమిపాలవ్వడం గ్రామస్థుల్ని కదిలించింది.
దీంతో.. ఈ ఓటమితో ధర్మపాల్ కుంగిపోకూడదన్న ఉద్దేశంతో ఆయనకు మద్దతుగా నిలిచారు. ఆయనలో జోష్ నింపేందుకు.. బహుమానం ఇద్దామని నిర్ణయించుకొని, అందరూ కలిసి రూ.2.11 కోట్ల విరాళాలు సేకరించారు. అనంతరం గ్రామంలో ప్రత్యేకంగా సభ ఏర్పాటు చేసి, ధర్మపాల్‌ను ఘనంగా సత్కరించారు. విరాళాల రూపంలో తాము సేకరించిన రూ. 2.11 కోట్ల నగదుని అందజేయడంతో పాటు.. ఒక ఖరీదైన స్కార్పియో కారుని సైతం బహూకరించారు. ఈ సన్మాన సభలో చిరీలోని అన్ని కులాల పెద్దలు పాల్గొన్నారు. ధర్మపాల్ ఒంటరివాడు కాదని, ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదని తెలియజెప్పడానికే తాము ఆ భారీ నగదుతో పాటు కారు అందజేశామని కులపెద్ద భలేరామ్ వివరించారు.
గ్రామస్తుల తన పట్ల చూపించిన ఈ ఔదార్యాన్ని చూసి ధర్మపాల్ కళ్లు చెమర్చాయి. తాను ఎల్లప్పుడూ జనం కోసమే జీవిస్తానని, వారి బాగు కోసం కృషి చేస్తానని చెప్పాడు. తనకు గ్రామస్థుల నుంచి విస్తృత ఆదరణ ఉన్నప్పటికీ, ఎందుకు ఎన్నికల్లో ఓడిపోయారని ప్రశ్నించినప్పుడు.. ఎన్నికల్లో గెలుపోటములనేవి సహజమేనని సమాధానం ఇచ్చాడు. గ్రామస్థులు చూపించిన ప్రేమ.. తానే ఈ ఎన్నికల్లో విజయం సాధించినంత ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నాడు.