Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్‌ వార్నింగ్

Drugs Control Department

Drugs Control Department

Drugs Control Department: కొన్ని మెడికల్‌ షాపుల ముందు 60%, 70%, 80% డిస్కౌంట్ అంటూ బోర్డులు చూస్తుంటాం.. తీరా వెళ్తే.. అక్కడ.. అన్నింటిపై ఆ స్థాయిలో డిస్కౌంట్లు ఉండవు.. ఒక్కోదానిపై ఒక్కో రకంగా.. అది కూడా.. బోర్డులపై ఉన్నదాని కంటే అతి తక్కువ డిస్కౌంట్‌ ఉన్న మెడిసినే ఎక్కువ అని వినియోగదారులు వాపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి.. అయితే, మందులపై 60%, 70%, 80% వరకు భారీ డిస్కౌంట్లు అంటూ ప్రకటనలు చేసే ఫార్మసీలు, మెడికల్ షాపులకు ఢిల్లీ డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ కీలక హెచ్చరిక జారీ చేసింది. వాస్తవంగా అందుబాటులో లేని లేదా అతిశయోక్తిగా చూపించే డిస్కౌంట్ ప్రకటనలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఢిల్లీలోని కెమిస్ట్ అసోసియేషన్లకు పంపిన అడ్వైజరీలో, కొన్ని రిటైల్ ఫార్మసీలు “UP TO 60%/70%/80% DISCOUNT” అంటూ బోర్డులు, బ్యానర్లు, ప్రకటనలు ప్రదర్శిస్తున్నట్లు డ్రగ్స్ కంట్రోల్ విభాగం పేర్కొంది. ఇలాంటి డిస్కౌంట్ ప్రకటనలు వాస్తవికంగా, పారదర్శకంగా ఉండాలని సూచించింది.

MRP కంటే తక్కువకు మందులు అమ్మొచ్చు
మందులను వాటి Maximum Retail Price (MRP) కంటే తక్కువ ధరకు విక్రయించడంపై ఎలాంటి నిషేధం లేదని ఢిల్లీ డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. అయితే ప్రచారం చేసే డిస్కౌంట్ మాత్రం నిజమైనదిగా ఉండాలి. కస్టమర్‌కు వాస్తవంగా లభించే డిస్కౌంట్‌ను మాత్రమే ప్రకటనల్లో పేర్కొనాలని సూచించింది. అంతేకాకుండా, ఇచ్చిన డిస్కౌంట్‌ను విక్రయ బిల్లులు, కొనుగోలు రికార్డుల ద్వారా ఫార్మసీలు ధృవీకరించగలగాలి. ప్రిస్క్రిప్షన్ మందుల విక్రయాలను ప్రోత్సహించే ప్రకటనలు కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఉండకూడదని అధికారులు తెలిపారు.

భారీ డిస్కౌంట్లపై ఎందుకు అనుమానం?
ఫార్మసీలు తయారీదారులు లేదా అధీకృత డిస్ట్రిబ్యూటర్ల నుంచి మందులను కొనుగోలు చేయాలని విభాగం సూచించింది. ముఖ్యంగా కొనుగోలు ధర కంటే కూడా తక్కువకు మందులు విక్రయిస్తున్నట్లు భారీ డిస్కౌంట్ ప్రకటనలు చేస్తే, ఆ మందుల అసలు మూలం, కొనుగోలు విధానంపై అనుమానాలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. “మందులు సాధారణ వినియోగ వస్తువులు కావు. అవి నేరుగా ప్రజల ఆరోగ్యం, ప్రాణాలతో సంబంధం ఉన్న అత్యవసర ఆరోగ్య ఉత్పత్తులు” అని డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. అందువల్ల వాటి కొనుగోలు, విక్రయాలు, పంపిణీలో మరింత బాధ్యత, పారదర్శకత, నైతిక ప్రమాణాలు అవసరమని తెలిపింది.

కేరళ హైకోర్టు తీర్పు ఆధారంగా చర్యలు
ఢిల్లీ డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన ఈ అడ్వైజరీకి జూన్ 19, 2026న కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా ఆధారంగా ఉంది. మందులపై నిజమైన డిస్కౌంట్లు ఇవ్వడాన్ని నిషేధించలేమని, అయితే ప్రజలను తప్పుదోవ పట్టించే లేదా అస్పష్టమైన డిస్కౌంట్ బోర్డులను నియంత్రించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. కేరళలోని డ్రగ్స్ కంట్రోలర్ జారీ చేసిన సర్క్యులర్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చింది. మందులను MRP కంటే తక్కువ ధరకు విక్రయించడంలో నిషేధం లేదని కోర్టు పేర్కొంది. అయితే “80% వరకు డిస్కౌంట్” వంటి భారీ ప్రకటనలతో కస్టమర్లను ఆకర్షించి, చివరకు చాలా తక్కువ తగ్గింపు ఇవ్వడం లేదా MRPకే మందులు విక్రయించడం తప్పుదోవ పట్టించే చర్యగా పరిగణించవచ్చని అధికారులు కోర్టుకు వివరించారు.

ఫార్మసీలు డిస్కౌంట్ ఇవ్వొచ్చు.. కానీ ప్రకటన నిజం కావాలి
కస్టమర్లకు మందులను తక్కువ ధరకు అందించడం వల్ల వాటి కొనుగోలు భారం తగ్గుతుందని, కాబట్టి నిజమైన డిస్కౌంట్లపై అభ్యంతరం లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే ప్రకటనల్లో చూపించే డిస్కౌంట్, కస్టమర్‌కు వాస్తవంగా లభించే ధరతో సరిపోలాలని పేర్కొంది.. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అన్ని కెమిస్ట్ అసోసియేషన్లు తమ సభ్యులకు ఈ నిబంధనలపై అవగాహన కల్పించాలని డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ సూచించింది. ఢిల్లీలో పనిచేస్తున్న రిటైల్ ఫార్మసీలు, మెడికల్ స్టోర్లు పారదర్శకత, వినియోగదారుల రక్షణ కోసం ఈ సూచనలను పాటించాలని కోరింది. కాగా, ఈ డిస్కౌంట్ల బోర్డులో దేశ రాజధాని ఢిల్లీకి పరిమితం కాకుండా.. దేశవ్యాప్తంగా.. అన్ని సిటీలు.. పట్టణాల్లోనూ.. చాలా మెడికల్‌ షాపుల ముందు నిత్యం చూస్తూనే ఉన్న విషయం విదితమే..