Site icon NTV Telugu

Launches Rs.5 Meal: దేశ రాజధానిలో కేవలం 5 రూపాయలకే మీల్స్..

Untitled Design (4)

Untitled Design (4)

దేశ రాజధాని ఢిల్లీలో నివసిస్తున్న పేదలకు రోజువారీ ఆహార సరఫరా ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారింది. రోజంతా కష్టపడుతున్నప్పటికీ, చాలామంది పేదలు ప్రతి రోజు పోషకాహారంతో కూడిన భోజనం పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని ఆహారం కోసం ఖర్చు చేయాల్సి రావడంతో, ఇతర మౌలిక అవసరాలను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని, ఎవరూ ఆకలితో బాధపడకూడదనే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం కేవలం రూ.5కే భోజనం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

అయితే అటల్ క్యాంటీన్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఢీల్లీ సీఎం రేఖా గుప్తా ప్రారంభించారు. తక్కువ ధరలో శుభ్రమైన, పోషకాహారాన్ని అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఢిల్లీలో 100 అటల్ క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు ఢిల్లీ పట్టణాభివృద్ధి మంత్రి ఆశిష్ సూద్ ప్రకటించారు. ఈ క్యాంటీన్లలో కేవలం రూ.5కే భోజనం అందించబడుతుందని ఆయన వెల్లడించారు.

ఈ 100 అటల్ క్యాంటీన్లు గురువారం నుంచే పనిచేస్తాయని మంత్రి తెలిపారు. అటల్ క్యాంటీన్ మెనూలో అన్నం, పప్పులు, కూరగాయలు, బ్రెడ్ వంటి పోషకాహార పదార్థాలు ఉంటాయని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా పేదలు, కార్మికులు, రోజువారీ వేతన జీవులు లబ్ధి పొందనున్నారని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Exit mobile version