ఎయిరిండియా మహిళా పైలట్ సృష్టి తులి మృతిపై మేనమామ వివేక్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సృష్టి తులి ఆత్మహత్య చేసుకోలేదని.. ఫ్రీ ప్లాన్డ్ మర్డర్ అని ఆరోపించారు. రాత్రి 11:30కి సృష్టి తులి తమతో మాట్లాడిందని.. అప్పుడు ఆమె చాలా ఉల్లాసంగా ఉందని.. ఎలాంటి ఆందోళన కనిపించలేదని చెప్పుకొచ్చారు. అలాంటిది కొద్దిసేపటికే ఎలా చనిపోతుందని.. కచ్చితంగా ఇది హత్యేనని పేర్కొన్నారు. 1971 యుద్ధంలో చనిపోయిన తన తాత ద్వారా ప్రేరణ పొంది.. పైలట్‌గా ఎంపికైందని తెలిపారు. పైలట్ యూనిఫాం ధరించాలన్న కలను సాకారం చేసిందని గుర్తుచేశారు.
సోమవారం సీసీటీవీ ఫుటేజీలో సృష్టి తులి సంతోషంగా ఉన్నట్లు కనిపించింది. ప్రియుడు ఆదిత్యతో కలిసి సంతోషంగానే ఉంది. అంత బాగా మాట్లాడిన సృష్టి.. 15-20 నిమిషాల్లో ఎలా చనిపోతుందని వివేక్ ప్రశ్నించారు. ప్రియుడు ఆదిత్యే చంపేశాడని ఆరోపించారు. పైలట్ శిక్షణ పొందే సమయంలో చాలా దృఢంగా ఉందని.. భయపడే స్వభావం లేదన్నారు. అలాంటిది ఎలా ఆత్మహత్య చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించారని వివేక్ తెలిపారు.
అసలేం జరిగిందంటే..
సోమవారం ముంబైలోని మారోల్ ప్రాంతంలో ఉన్న అద్దె ఇంటిలో సృష్టి తులి-ఆదిత్య మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కొద్ది రోజులు తనతోనే ఉండాలంటూ పండిట్‌ను సృష్టి తులి కోరింది. అయితే అందుకు అతడు నిరాకరించాడు. ఇలా ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో ఆదిత్య కారులో ఢిల్లీకి బయల్దేరి వెళ్లిపోయాడు. సృష్టి తులి.. ఆదిత్యకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. వీడియో కాల్‌లో ఉరి తాడు చూపించినా.. ఆదిత్య మనసు మార్చుకోలేదు. కానీ అంతలోనే ఆమె చేయాల్సిన పని చేసేసింది. ఈ ఘటనతో కంగారు పడ్డ ఆదిత్య.. తిరిగి ఇంటికి వచ్చేసరికి డోర్ వేసి ఉంది. అయితే ఆదిత్య.. మరో మహిళా పైలట్ సాయంతో డోర్ ఓపెన్ చేసి చూడగా.. మెడకు కేబుల్ వైర్ చుట్టుకుని ఉంది. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. పైలట్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం బాధితురాలి కుటుంబ సభ్యులకు ఆదిత్య ఫోన్ చేసి సమాచారం అందించాడు. అయితే సృష్టి తులి మరణవార్త తెలిసి షాక్ అయ్యారు.
ఇదిలా ఉంటే సృష్టి తులితో ఆదిత్య చేసిన చాటింగ్‌ను తొలగించాడు. తులి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా ఆరోపణలు రావడంతో చాటింగ్‌ను పోలీసులు రికవరీ చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటే తాను కూడా సూసైడ్ చేసుకుంటానని ఆదిత్య.. తులిని హెచ్చరించినట్లుగా పోలీసులు గుర్తించారు. కానీ ఆమె అన్నంత పనే చేసింది. ఆదిత్య ఫోన్‌ను పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులకు పంపించారు. తులి మరణానికి ముందు ఇద్దరి మధ్య దాదాపు 10-11 ఫోన్ కాల్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా సృష్టి ఫోన్‌లో చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అవి ఎవరు చేశారన్నది తెలియాల్సి ఉంది. ఇక సృష్టి ఆత్మహత్య చేసుకోకుండా ఉండేందుకు ఆదిత్య పదే పదే ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే సృష్టి ఎలాంటి సూసైడ్ నోట్ రాయకుండానే ప్రాణాలు తీసుకుంది.
మరోవైపు సృష్టి ఆత్మహత్యకు 15 నిమిషాల ముందే తల్లి, అత్తతో ఉల్లాసంగా మాట్లాడింది. ఆమెలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. అయితే ఆదిత్య వేధింపులు కారణంగానే సృష్టి చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. రెండేళ్ల క్రితం ఢిల్లీలో పైలట్ శిక్షణ కేంద్రంలో మొదలైన స్నేహం.. ప్రేమగా మారి బంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా ఆదిత్య.. సృష్టిని వేధిస్తున్నాడని.. ఈ ఏడాది మార్చిలో గురుగ్రామ్‌లో పార్టీలో సృష్టి నాన్ వెజ్ తిన్నాదని విపరీతంగా దుర్బాషలాడాడని.. అంతేకాకుండా మార్గమధ్యలో కారులోంచి దింపేసి వెళ్లిపోయాడని.. ఒంటరిగా ఇంటికెళ్లిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. బహిరంగంగానే సృష్టిని అవమానించేవాడని వాపోయారు. ఓ రోజు అయితే సృష్టి మీద కోపంతో మరో వాహనాన్ని ఢీకొట్టాడని గుర్తుచేశారు. ఇక దీపావళికి సృష్టి తులి అకౌంట్ నుంచి రూ.65,000 ఆదిత్య ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడని చెప్పుకొచ్చారు. సృష్టి పైలట్‌గా ఎంపికవ్వడం.. అతడు సెలెక్ట్ కాకపోవడంతో అప్పటినుంచి సృష్టిపై అసూయ పడుతూనే ఉన్నాడని బాధిత కుటుంబం కన్నీటిపర్యంతం అయింది.