CNR Rao: భారతరత్న శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావుకు ఎస్ఐఆర్ నోటీసు.. కారణం ఇదే!

  • ఒక్క ‘ఎఫ్’ అదనంగా రావడంతో సి.ఎన్.ఆర్. రావుకు నోటీసు
  • ఓటర్ లిస్టులో విచిత్రం
Cnr Rao

Cnr Rao

CNR Rao Gets SIR Notice: భారతదేశానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న గ్రహీత ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్. రావు పేరు ఓటర్ జాబితాలో తప్పుగా నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా ఆయన పేరులో అక్షర వ్యత్యాసం గుర్తించారు. దీంతో తన గుర్తింపును నిర్ధారించేందుకు విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసు జారీ చేశారు.

పేరులో ఒక ‘ఎఫ్’ అదనంగా..

2002 నాటి ఓటర్ జాబితాలో సి.ఎన్.ఆర్. రావు పేరు “Prof C N R Rao”గా నమోదైంది. అయితే ప్రస్తుత ఓటర్ జాబితాలో ఆయన పేరు “Proff C N R Rao”గా ఉంది. అంటే పేరులో అదనంగా ఒక ‘f’ చేరింది. ఈ చిన్న అక్షర వ్యత్యాసమే SIR ప్రక్రియలో అధికారుల దృష్టికి వచ్చింది. దీనిని ‘Self Name Mismatch’గా పరిగణిస్తూ రావుకు నోటీసు పంపినట్లు సమాచారం.

‘సెల్ఫ్ నేమ్ మిస్‌మ్యాచ్’ అంటే ఏమిటి?

SIR ఎన్యూమరేషన్ ఫారమ్‌లో ఓటరు 2002 ఓటర్ జాబితాలో ఉన్న తన వివరాలను ఉపయోగించినప్పుడు, ఆ వివరాలు ప్రస్తుత ఓటర్ జాబితాలో ఉన్న వివరాలతో సరిపోలకపోతే దాన్ని Self Name Mismatchగా పరిగణిస్తారు. పేరు, స్పెల్లింగ్ వంటి వివరాల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉన్నప్పటికీ అవి అధికారిక పరిశీలనకు కారణమవుతున్నాయి.

వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిందే

ఇలాంటి కేసుల్లో నోటీసు అందుకున్న వ్యక్తి మాత్రమే విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అందువల్ల ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్. రావు బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) సమీపంలోని నిర్దేశిత ప్రదేశంలో వ్యక్తిగతంగా హాజరు కావాలని సూచించారు.

92 ఏళ్ల వయసులోనూ వార్తల్లోకి..

బెంగళూరులో జన్మించిన 92 ఏళ్ల సి.ఎన్.ఆర్. రావు భారత శాస్త్రరంగంలో విశేష సేవలు అందించారు. మెటీరియల్స్ సైన్స్, కెమిస్ట్రీ తదితర రంగాల్లో ఆయన చేసిన పరిశోధనలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ఆయనకు 2014లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. ఈ గౌరవాన్ని అందుకున్న శాస్త్రవేత్తల్లో ఆయన మూడో వ్యక్తిగా గుర్తింపు పొందారు.

సాధారణంగా ఓటర్ జాబితాలో పేరు లేదా ఇతర వివరాల్లో చిన్నపాటి వ్యత్యాసాలు ఉన్నప్పుడు వాటిని సరిచేసుకునే అవకాశం ఉంటుంది. అయితే SIR ప్రక్రియలో భాగంగా వివరాలను ధ్రువీకరించేందుకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రొఫెసర్ సి.ఎన్.ఆర్. రావు వంటి దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్త పేరు కేవలం ఒక అక్షరం తేడాతో ఓటర్ జాబితాలో భిన్నంగా నమోదై, దాని కారణంగా నోటీసు రావడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.