Site icon NTV Telugu

Chinese Manja Accident : దడ పుట్టిస్తున్న చైనా మాంజా.. మెడకు తగిలి యువకుడికి 19 కుట్లు

Untitled Design (5)

Untitled Design (5)

ఒకప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందంటే చిన్నా పెద్దా తేడా లేకుండా గాలిపటాలు ఎగరవేసి ఆనందించేవారు. కానీ ఇప్పుడు గాలిపటాలు ఎగరవేయాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం నిషేధిత చైనా మాంజా వినియోగం. ఈ మాంజా కేవలం మనుషులకే కాదు, జంతువులు, పక్షుల ప్రాణాలను కూడా హరిస్తోంది. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా వందలాది మంది ఈ మాంజా కారణంగా గాయపడుతుండగా, పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.

అయితే…మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని మల్లికార్జున్ నగర్‌లో గాలిలో ఎగురుతున్న చైనా మాంజా అకస్మాత్తుగా ఓ యువకుడి మెడకు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో యువకుడి గొంతు బాగా కోసుకుపోయి, మెడ వద్ద మొత్తం 19 కుట్లు వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇటీవల చైనా మాంజా వల్ల జరుగుతున్న ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాల్లోనూ ఇటువంటి ఘటనలు తరచుగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సమయంలో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

సింథటిక్ నైలాన్ లేదా ప్లాస్టిక్ తాడుతో తయారు చేసే ఈ చైనా మాంజాపై పొడి గాజు ముక్కలు, మెటల్ పౌడర్ లేదా ఇతర పదునైన రసాయనిక పదార్థాలతో పూత పూస్తారు. దీంతో అది కత్తికంటే కూడా ప్రమాదకరంగా మారి, సులభంగా మనుషుల గొంతులు కోసేస్తోంది. ప్రభుత్వాలు చైనా మాంజాపై నిషేధం విధించినప్పటికీ, అమలు విషయంలో కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చైనా మాంజాను విక్రయించినా లేదా వినియోగించినా రూ.5,000 జరిమానా లేదా ఒక సంవత్సరం జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నప్పటికీ, అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version