Site icon NTV Telugu

Agnipath: గుడ్‌న్యూస్.. ‘అగ్నిపథ్‌’ సర్వీస్‌కు అర్హత వయసు పెంచిన కేంద్రం

Agnipath

Agnipath

స్వల్పకాలానికి జవాన్లను నియమించేందుకు వీలుగా కేంద్రం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’​ పథకంపై నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది. అగ్నిపథ్​ పథకం సైన్యంలోని నియామక ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపదని.. స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు 17.5 నుంచి 21 ఏళ్లుగా ఉన్న అర్హత వయసును 23కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

త్రివిధ దళాల్లో సైనిక నియమకాల కోసం ‘అగ్నిపథ్‌’ పేరుతో కేంద్రం ఇటీవల కొత్త సర్వీస్‌ పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దరఖాస్తు చేసుకునేందుకు అర్హత వయసును 17.5 నుంచి 21 ఏళ్లుగా నిర్ణయించారు. అయితే కొవిడ్‌ కారణంగా గత రెండేళ్ల నుంచి సైనిక నియమకాలు చేపట్టకపోవడంతో కేంద్రం ఈ ఏడాది కొంత సడలింపు ఇచ్చింది. 2022 నియమకాలకు సంబంధించి అర్హతను గరిష్టంగా 23 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. కేంద్రం ప్రవేశ‌పెట్టిన‌ అగ్నిపత్ పథకంపై నిరసన వ్యక్తంచేస్తూ ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాల్లో చేరాలనుకునే ఆశావహులు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్న సంగతి తెలిసిందే.

నాలుగేళ్ల కాలపరిమితితో తొలిసారిగా కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ సర్వీస్‌ పథకం కింద తొలిబ్యాచ్‌లో 45వేల మందిని నియమించనున్నారు. టూర్‌ ఆఫ్‌ డ్యూటీ పేరిట ప్రత్యేక ర్యాలీలు నిర్వహించి ఈ నియామకాలు చేపట్టనున్నారు. నాలుగేళ్ల పరిమితితో కూడిన ఈ సర్వీస్‌లో ఎంపికన వారికి సాంకేతిక నైపుణ్యంతో పాటు క్రమశిక్షణ కలిగినవారిగా తీర్చిదిద్దనున్నారు. ఆర్మీ సర్వీసు పూర్తయ్యాక మెరుగైన ప్యాకేజీతో పాటు తుది దశ ఎంపికలో ప్రతిభ చూపిన 25 శాతం మందికి శాశ్వత కమిషన్‌లో పనిచేసేందుకు అవకాశమివ్వనున్నారు. మరోవైపు ఈ పథకంపై గురువారం దేశంలోని పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. బిహార్‌లో ఆందోళనకారులు పలు రైళ్లకు నిప్పుపెట్టారు. మధ్యప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో యువత ఆందోళన బాటపట్టింది. పాత పద్ధతిలో సైనిక నియమకాలు చేపట్టాలని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పలుచోట్ల రాళ్ల దాడులు చోటుచేసుకున్నాయి.

Exit mobile version