Site icon NTV Telugu

Cement Prices: సామాన్యుడికి ఊరట.. తగ్గనున్న సిమెంట్ ధరలు

Cement Prices

Cement Prices

పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు మరో గుడ్ న్యూస్‌ అందించింది. ప్లాస్టిక్, సిమెంట్, ముడి పదార్థాలపై సుంకం తగ్గించనున్నట్లు ఆర్ధిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సిమెంట్‌ లభ్యత మెరుగు పడటంతో పాటు మెరుగైన లాజిస్టిక్స్‌ ద్వారా సిమెంట్‌ ధరను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అంతేకాకుండా స్టీల్ ఉత్పత్తులపై ఎగుమతి సుంకం విధించనున్నట్లు పేర్కొన్నారు. ఫలితంగా దేశంలో సిమెంట్, స్టీల్ కొరత తగ్గి ధరలు తగ్గుతాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. తద్వారా గృహ నిర్మాణ వ్యయం భారీగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.

Narandra Modi: ప్రజలే మాకు తొలి ప్రాధాన్యత.. అందుకే ధరలు తగ్గించాం

ప్రపంచం ఇప్పటికీ కరోనా నష్టాల నుంచి పూర్తిగా రికవరీ కాలేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతేకాకుండా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో ఆయిల్ సరఫరాలో సమస్యలు ఏర్పడ్డాయని.. నూనెలతో పాటు చాలా వస్తువులకు కొరత ఏర్పడిందని తెలిపారు. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగి అనేక దేశాలు ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నాయని నిర్మలా సీతారామన్ పేర్కొ్న్నారు. గత ఏడాది నవంబరులోనే తమ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించిందని.. ఇప్పుడు మళ్లీ తగ్గిస్తున్నట్లు గుర్తుచేశారు. ఏటా రూ.6,100 కోట్ల భారం పడుతున్నా గ్యాస్‌పై సబ్సిడీ ఇస్తున్నామని ఆమె తెలిపారు. ప్లాస్టిక్ దిగుమతిపై భారత్ అధికంగా ఆధారపడిందని.. అందుకే ముడిసరుకులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నామన్నారు. కాగా సిమెంట్, స్టీల్ ధరలు తగ్గితే దేశవ్యాప్తంగా సామాన్యులకు ఎంతో మేలు జరగనుంది. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు సామాన్యులు సిమెంట్‌ విషయంలో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పుడు సిమెంట్‌ ధరలు తగ్గిస్తే ఎంతో ఊరటనిచ్చినట్లవుతుంది.

Exit mobile version