
దేశంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కరోనా సోకుతున్నది. ఇప్పటికే అనేక మంది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులు కరోనా బారిన పడ్డారు. తాజాగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర కరోనా బారిన పడ్డారు. ఆయనతో పాటుగా ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కూడా కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ లు ఇద్దరు కరోనా బారిన పడ్డారని సీఈసీ ఈరోజు ప్రకటించింది. ప్రస్తుతం ఇద్దరు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇంటి నుంచి ఇద్దరు పనులు చేస్తున్నారని సీఈసీ తెలియజేసింది. వారం రోజుల క్రితం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గా సుశీల్ చంద్ర పదవీబాధ్యతలు చేపట్టారు. సునీల్ ఆరోడా పదవీవిరమణ చేయడంతో ఆయన స్థానంలో సుశీల్ చంద్ర బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.