Site icon NTV Telugu

Sippy Sidhu: హత్య కేసులో పెద్ద ట్విస్ట్.. హైకోర్టు జడ్జి కూతురు అరెస్ట్

Sippy Sidhu Girlfriend Kalyani Singh

Sippy Sidhu Girlfriend Kalyani Singh

సుఖ్‌మన్‌ప్రీత్ సింగ్ (35) అలియాస్ సిప్పీ సిద్ధూ హత్య కేసు గుర్తుందా? నేషనల్ లెవల్ షూటర్ అయిన అతడు 2015 సెప్టెంబర్ 15వ తేదీన దారుణ హత్యకు గురయ్యాడు. జాతీయ షూటర్, పైగా హైప్రొఫైల్ కుటుంబానికి చెందినవాడు కావడంతో.. సిప్పీ సిద్ధూ హత్య అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, సరైన సాక్ష్యాధారాలు దొరక్కపోవడం వల్ల ఈ కేసు ఓ కొలిక్కి రాలేదు. ఏడేళ్ల వరకూ విచారణ కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ హత్య చేయించింది సిద్ధూ ప్రియురాలు కళ్యాణినే అని అనుమానిస్తోన్న సీబీఐ, ఆమెని అరెస్ట్ చేసింది. ఈమె హిమాచల్ ప్రదేశ్ తాత్కాలిక న్యాయమూర్తి సబీనా కూతురు. కళ్యాణి ఒక ప్రొఫెసర్ కూడా!

నిజానికి.. సిద్ధూ హత్య వెనుక అతని గర్ల్‌ఫ్రెండ్ కళ్యాణి హస్తముందని ముందు నుంచే అనుమానాలు ఉన్నాయి. కాకపోతే, ఆమెకు వ్యతిరేకంగా సరైన ఆధారాలు దొరక్కపోవడంతో యాక్షన్ తీసుకోలేదు. ఎంతసేపటికీ ఈ కేసు ముందుకు సాగకపోవడంతో.. 2016లో పంజాబ్‌ గవర్నర్‌ జోక్యంతో కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో క్లూ అందిస్తే, వాళ్లకు రూ. 5 లక్షల నజరానా ఇస్తామని అప్పట్లో సీబీఐ ప్రకటించింది. కేసుని విచారిస్తున్న సమయంలో, సిద్ధూ హత్య జరిగిన సమయంతో అతనితో ఓ యువతి ఉందన్న విషయాన్ని సీబీఐ తేల్చింది. దీంతో.. ఆమె ఎవరో ముందుకొస్తే నిరపరాధిగా పేర్కొంటామని, లేదంటే హత్యలో ఆమెకూ భాగం ఉంటుందని తేల్చాల్సి ఉంటుందని సీబీఐ ఓ ప్రకటన ఇచ్చింది. ఆ తర్వాత 2021లో నజరానాను రూ.10 లక్షలకు పెంచినా, ప్రయోజనం లేకుండా పోయింది. ఆ అమ్మాయి ఎవరో ముందుకు రాలేదు.

ఈ నేపథ్యంలోనే ఈ హత్య సిద్ధూ ప్రేయని కళ్యాణి చేయించిందని, ఆమెను అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఈ క్రమంలో కళ్యాణి సింగ్‌ను ప్రశ్నించారు. అనంతరం ఆమె హస్తం ఉందన్న అనుమానంతో అరెస్ట్ చేశారు. కళ్యాణిని కూలంకశంగా ప్రశ్నించాకే అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారు ఒకరు స్పష్టం చేశారు. రిలేషన్‌షిప్‌ బెడిసి కొట్టడంతోనే ఆమె సిప్పీని హత్య చేయించిందని సమాచారం. న్యాయమూర్తి ఎదుట కళ్యాణిని హాజరు పరిచాక.. నాలుగు రోజుల కస్టడీకి సీబీఐ తీసుకుంది. కాగా.. సిద్ధూ షూటర్‌ మాత్రమే కాదు, కార్పొరేట్‌ లాయర్‌ కూడా! ఛండీగఢ్‌ సెక్టార్‌ 27లో బుల్లెట్లు దిగబడిన సిద్ధూ మృతదేహాన్ని అప్పట్లో పోలీసులు గుర్తించారు.

Exit mobile version