Bridegroom Demands Virginity Test For Bride In Bihar: బిహార్‌లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగిన తర్వాత.. అప్పగింతల సమయంలో వధువు, వరుడు బంధువుల మధ్య ఒక చిన్న గొడవ జరిగింది. ఈ క్రమంలోనే వధువుకి కన్యత్వ పరీక్షలు చేయాలని వరుడు డిమాండ్ చేయడంతో.. అక్కడున్నవారంతా ఖంగుతిన్నారు. ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారి.. చివరికి పోలీస్ స్టేషన్‌దాకా చేరుకుంది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. బిహార్‌లోని తూర్పు చంపారణ్జిల్లాలో మోతిహరికి చెందిన ఓ జంటకు నవంబర్ 16వ తేదీన వివాహం జరిగింది. ఈ పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వధువరుల కుటుంబ సభ్యులందరూ కలిసి మెలిసి.. ఈ వేడుకని ఒక పండుగలా జరుపుకున్నారు. ఇక్కడివరకూ అంతా బాగానే ఉంది కానీ.. అప్పగింతల సమయంలోనే అసలు ట్విస్ట్ వెలుగు చూసింది. వధువు తల్లిదండ్రులు.. తమ కుమార్తెను అత్తారింట్లో ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా, సంతోషంగా చూసుకుంటానని మాటివ్వాలని వరుడిని కోరారు. అంతేకాదు.. పేపర్ మీద రాసి ఇవ్వాలని కూడా అడిగారు.
దీంతో కోపోద్రిక్తుడిన వరుడు.. వధువు కుటుంబీకులంతా షాక్‌కి గురయ్యే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. తాను పేపర్ మీద రాసివ్వడానికి సిద్ధమే కానీ, అంతకుముందు వధువు కన్యత్వ పరీక్ష చేయించుకోవాలని డిమాండ్ చేశాడు. ఆ దెబ్బకు ఖంగుతిన్న వధువు కుటుంబీకులు.. వరుడితో పాటు అతని బంధవుల్ని బంధించారు. రెండ్రోజుల వరకు విడుదల చేయలేదు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. అప్పుడు వాళ్లను విడుదల చేశారు. అయితే.. పెళ్లికుమారుడితో వధువు అత్తారింటికి వెళ్లలేదు.