Boyfriend Tried To Stop Girlfriend Marriage In Tamilnadu: అదొక పెళ్లి వేడుక.. ఈ పెళ్లి తంతు చూసేందుకు వందలాది మంది బంధుమిత్రులు, సన్నిహితులు విచ్చేశారు. అక్కడంతా సందడి వాతావరణం నెలకొంది. ఇంకొన్ని క్షణాల్లోనే పెళ్లి అయిపోతుందని.. వరుడు, వధువు తరఫు వాళ్లు సంతోషంగా ఉన్నారు. మొత్తానికి తాళి కట్టే సమయం రానే వచ్చేసింది. తాళి కట్టేందుకు వరుడు లేవబోతున్నాడు. ఇంతలోనే ప్రియుడు సడెన్ ఇచ్చి, ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. వేదిక పైకి వచ్చి.. వరుడు దగ్గర నుంచి తాళి లాక్కొని, వధువు మెడలో కట్టే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తండయార్‌లో చోటు చేసుకుంది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని తండయార్‌కు చెందిన సుమతి అనే 20 ఏళ్ల అమ్మాయికి, అదే ప్రాంతంలో నివసిస్తున్న రాజ్ అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. నాలుగు నెలల క్రితమే వీరి నిశ్చితార్థం జరిగింది. పెళ్లి సమయం దగ్గర పడడంతో.. ఇరు కుటుంబ సభ్యులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. పెళ్లికి బంధుమిత్రులు, సన్నిహితుల్ని పిలిచారు. అందరూ ఈ పెళ్లి తంతు వీక్షించేందుకు వచ్చారు. అందరిలాగే వధువు ప్రియుడు కూడా ఓ అతిథిలా ఈ పెళ్లికి విచ్చేశాడు. వేదికపై పూజారి మంత్రాలు చదవడం.. వధువు, వరుడు కూర్చోవడం అంతా జరిగింది. తాళి కట్టేందుకు సమయం ఆసన్నమవ్వడంతో.. తాళి కట్టమని వరుడుకి పూజారి చెప్పాడు. అప్పుడే వధువు ప్రియుడు ట్విస్ట్ ఇచ్చాడు. వేదిక మీదకెక్కి, వరుడు చేతిలో నుంచి తాళి లాక్కొని, వధువు మెడలో కట్టబోయాడు. అతని చర్యతో ఖంగుతిన్న వధువు అన్నయ్య, బంధవులు.. వెంటనే తేరుకొని అతడ్ని అడ్డుకున్నారు. తాళి లాక్కొని, అతడికి దేహశుద్ధి చేశారు. పోలీసులకు పట్టించారు.
అసలు అతనెవరు? ఎందుకీ చర్యకి పాల్పడ్డాడు? అని పోలీసులు విచారించగా.. అతడు తండయార్‌కు చెందిన సుందరేష్‌గా తేలింది. గతంలో వధువుతో అతడు ప్రేమాయణం నడిపినట్టు వెలుగులోకి వచ్చింది. వీళ్లిద్దరు కలిసి ఒకే చోట పని చేశారు. కొన్ని రోజుల్లోనే ఆ పరియం ప్రేమగా మారింది. అయితే.. తల్లిదండ్రులకు తమ ప్రేమను ఒప్పించలేకపోయారు. అయితే.. ఎలాగైనా సుమతిని తన సొంతం చేసుకోవాలని సుందరేష్ భావించాడు. అందుకే, ఆమె పెళ్లి చెడగొట్టేందుకు ఈ చర్యకి పాల్పడ్డాడని తెలిసింది. అతడు కోరినట్టుగానే.. ఆ పెళ్లి ఆగిపోయింది.
