BJP MP Ramrao Wadkute: 8 నెలల క్రితమే రాజ్యసభకు ఎంపిక.. బీజేపీ ఎంపీ గుండెపోటుతో మృతి

Bjp Mp Ramrao Wadkute

Bjp Mp Ramrao Wadkute

BJP MP Ramrao Wadkute: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యుడు రాంరావ్ వడ్కుటే కన్నుమూశారు. గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. ఛాతిలో నొప్పితో బాధపడుతుండడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలోనే తుదిశ్వాస విడిచారు. రాంరావ్ వడ్కుటేను బీజేపీ సుమారు ఎనిమిది నెలల క్రితమే రాజ్యసభకు పంపించింది. మహారాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన నాయకుడిగా, మంచి పేరున్న నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. అలాగే ధనగర్ సామాజిక వర్గంలో ప్రముఖ నాయకుడిగా కొనసాగారు.

రాంరావ్ వడ్కుటే గతంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో పనిచేశారు. మహారాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2019 అక్టోబర్‌లో ఎన్సీపీని వీడి బీజేపీలో చేరారు. 2021లో ఆయనకు హింగోలి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. అనంతరం హింగోలి లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా, ఎన్నికల ముఖ్య బాధ్యుడిగా కూడా వ్యవహరించారు. రాంరావ్ వడ్కుటే షెళీ-మెండీ మహాసంఘ్ (గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య) అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన మృతి పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యసభకు ఎన్నికైన కేవలం ఎనిమిది నెలలకే ఆయన మరణించడంతో రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది.