NTV Telugu Site icon

Delhi Election: మరో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ.. విద్యార్థులే లక్ష్యంగా వరాలు

Delhielection

Delhielection

దేశ రాజధాని ఢిల్లీలో జోరుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. ప్రధాన పార్టీలు నువ్వానేనా? అన్నట్టుగా ఢీకొంటున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ ఆప్.. పలు ప్రజాకర్షక పథకాలను ప్రకటించింది. అయితే ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఓట్లు రాబట్టేందుకు ఇప్పటికే తొలి విడత మేనిఫెస్టోలో మహిళా ఓటర్లను ఆకట్టుకునే పథకాలను ప్రకటించింది. తాజాగా మంగళవారం రెండో మేనిఫెస్టోను విడుదల చేసింది. విద్యార్థులు, యువత లక్ష్యంగా పలు ఆకర్షక పథకాలను వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనురాగ్ ఠాకూర్ మేనిఫెస్టో వివరాలు వెల్లడించారు.

ఫ్రీ ఎడ్యుకేషన్.. యువతకు సాయం..
కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యతో పాటు ఆర్థిక సాయం కూడా అందిస్తామని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఢిల్లీలో జల్ జీవన్ మిషన్‌ను అమలు చేయడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని ఠాకూర్ విమర్శించారు. అధికారంలోకి వస్తే మౌలిక సదుపాయాలు, సంక్షేమాన్ని మెరుగుపరచడానికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. యువతకు పోటీ పరీక్షల కోసం రూ.15,000 ఆర్థిక సహాయం, రెండుసార్లు ఉచితంగా ప్రయాణించేందుకు, దరఖాస్తు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని ఠాకూర్‌ తెలిపారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, స్టేట్ పీసీఎస్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు రెండు సార్లు రూ. 15,000 ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అలాగే భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ స్టైపెండ్‌ పథకం కింద ఐటీఐలు, పాలిటెక్నిక్‌ స్కిల్‌ సెంటర్లలో టెక్నికల్‌ కోర్సులు అభ్యసిస్తున్న షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థులకు ప్రతినెలా రూ.1,000 చొప్పున ఉపకార వేతనాలు అందజేస్తామని వెల్లడంచారు.

ఆటో-టాక్సీ డ్రైవర్లకు సాయం..
ఇక ఆటో-టాక్సీ డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటును బీజేపీ ప్రకటించింది. డ్రైవర్లకు రూ.10 లక్షల జీవిత బీమా మరియు రూ.5 లక్షల ప్రమాద బీమా హామీ ఇచ్చింది. గృహ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు, బీమా ప్రయోజనాలు కల్పిస్తామని తెలిపింది. ఇక బీజేపీ అధికారంలోకి వస్తే ఆప్ ప్రభుత్వ అక్రమాలపై సిట్ దర్యాప్తునకు ఆదేశిస్తామని తెలిపారు.

జనవరి 17న కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తొలి మేనిఫెస్టో విడుదల చేశారు. ప్రస్తుత సంక్షేమ పథకాలను కొనసాగించడంతో పాటు 60-70 ఏళ్ల వయస్సున్న వృద్ధులకు నెలవారీ పెన్షన్ రూ.2,500 మరియు 70 ఏళ్లు పైబడిన వారికి రూ.3,000 వంటి కొత్త వాగ్దానాలు ప్రకటించారు. మహిళల కోసం పార్టీ మాతృ సురక్ష వందన పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి గర్భిణీ స్త్రీకి ఆరు పౌష్టికాహార కిట్లు, రూ.21,000 సాయం అందజేస్తామని ప్రకటించింది. 27 ఏళ్ల క్రితం ఢిల్లీని పాలించిన బీజేపీ.. అప్పటి నుంచి తిరిగి అధికారంలోకి రాలేదు. 2015, 2020లో జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడు, ఎనిమిది స్థానాలను మాత్రమే దక్కించుకుంది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా… ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి.