Samrat chaudhary: బీహార్ రాజకీయాల్లో సీఎం నితీష్ కుమార్ శకం ముగిసింది. గత రెండు దశాబ్ధాలుగా బీహార్ సీఎంగా కొనసాగుతున్న ఆయన మంగళవారం గవర్నర్‌కు తన రాజీనామా సమర్పించారు. ఇదిలా ఉంటే బీహార్‌తో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం సుగమమైంది. జేడీయూ మద్దతులో తొలిసారిగా బీజేపీ నేత బీహార్ సీఎం కాబోతున్నారు. అయితే, ఆ సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అందరిలో కన్నా ముందున్నవారిలో బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి పేరు వినిపిస్తోంది. బీజేపీ ఫైర్ బ్రాండ్‌గా పేరున్న ఈయనే తదుపరి సీఎం అవుతారని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ ఆమోదం ఆయనకు లభించినట్లు బీహార్ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిబడుతోంది. సాయంత్రం 4 -5 గంటల వరకు బీహార్ నెక్ట్స్ సీఎం పేరు అధికారికంగా తెలిసే అవకాశం ఉంది. కొత్తగా ఎన్నికైన సీఎం ప్రమాణస్వీకారం బుధవారం జరిగే అవకాశం ఉంది.
బీహార్ శాసనసభ నాయకుడి ఎంపికకు బీజేపీ కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు అప్పగించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ సమక్షంలో పార్టీ కొత్త సీఎం ఎంపిక జరుగుతుంది. ఇప్పటికే, బీజేపీ తన ఎమ్మెల్యేలు అందరిని పాట్నాకు రావాల్సిందిగా ఆదేశించింది. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఉన్న బీహార్ ఎమ్మెల్యేలు కూడా పాట్నాకు చేరుకున్నారు.
దాదాపుగా బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి అని తెలుస్తోంది. ఆయనకు, ఆయన నివాసం చుట్టూ భద్రత పెంచడం ఈ అనుమానాల్ని మరింత బలపరుస్తోంది. నితీష్ కుమార్ ముఖ్య కార్యదర్శి దీపక్ కుమార్, సామ్రాట్ చౌదరిని ఆయన నివాసంలో కలిశారు. ప్రస్తుతం బీహార్ క్యాబినెట్‌లో ఈయన ఉపముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా ఉణ్నారు. ఓబీసీ వర్గంలో ప్రముఖ నాయకుడిగా ఈయన ఉన్నారు. సామ్రాట్ చౌదరి నితీష్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడు. పలు సందర్భాల్లో సీఎంగా ఉన్న సమయంలో నితీష్ కుమార్ మాట్లాడుతూ.. ఇకపై అన్నీ ఈయనే చూసుకుంటాడని చెప్పారు.
ఎవరీ సామ్రాట్ చౌదరి:
తన తండ్రి బాటలో సామ్రాట్ చౌదరి రాజకీయాల్లోకి వచ్చారు. తన రాజకీయ ప్రస్థానాన్ని సమతా పార్టీ నుంచి ప్రారంభించారు. ఆ తర్వాత ఆర్జేడీల చేరారు. ఆయన ఆర్జేడీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. దీని తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీలోనే ఆయన రాజకీయంగా ఎదిగారు. 2018లో సామ్రాట్ చౌదరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత పార్టీ ఉపాధ్యక్షుడయ్యారు. 2020లో బీజేపీ నుంచి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2022లో నితీష్ కుమార్ బీజేపీతో సంబంధాలు తెంచుకుని ఆర్జేడీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో సామ్రాట్ చౌదరి రాజకీయంగా మరింత గుర్తింపు పొందారు. ఆయన శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా మారారు. 2023లో బీజేపీ బీహార్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మళ్లీ నితీష్ కుమార్ బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, మంత్రి పదవి చేపట్టారు. 2025 ఎన్నికల తర్వాత బీజేపీ+జేడీయూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపముఖ్యమంత్రితో పాటు హోంమంత్రిత్వ శాఖ చేపట్టారు. ఇప్పుడు సీఎంగా మారబోతున్నారు.
