Site icon NTV Telugu

Bhojshala Complex: భోజశాల మందిరామా, మసీదా..? ఒకప్పటి సంస్కృత విద్యా కేంద్రం, నేడు వివాదం..

Bhojshala Dispute

Bhojshala Dispute

Bhojshala Complex: దేశంలో మరో మందిర్-మసీదు వివాదం కొనసాగుతోంది. ఇప్పటివరకు అయోధ్య-బాబ్రీ మసీదు, కాశీ విశ్వనాథ ఆలయం-జ్ఞానవాపి మసీదు, శ్రీ కృష్ణ జన్మస్థలం-షాహీ ఈద్గా దర్గా వివాదాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ జాబితాలో మధ్యప్రదేశ్‌ ధార్‌లోని భోజశాల-కమల్ మౌలా మసీదు కూడా ఉంది. వసంత పంచమి నేపథ్యంలో భోజశాల కాంప్లెక్స్‌లో హిందూ, ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, ఈ అంశం వార్తల్లో నిలిచింది.

పునాది వేసిన భోజ రాజు..

ఒకప్పుడు వేద ఘోష, సంస్కృతంతో ప్రతిధ్వనించిన ఈ చారిత్రాత్మక కట్టడం ఇప్పుడు వివాదంలో ఉంది. ప్రస్తుతం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) దీనిని “భోజ్‌శాల ఆలయం-కమల్ మౌలా మసీదు సముదాయం”గా పిలుస్తోంది. క్రీ.శ 1034లో పర్మార్ రాజవంశానికి చెందిన శక్తివంతమైన రాజు భోజుడు దీనికి పునాది వేశారు. భోజరాజు యోధుడు మాత్రమే కాదు, 72 కళలు, 36 రకాల ఆయుధాల వాడకంలో నిపుణుడు. ప్రస్తుతం భోజశాలగా పిలువబడుతున్న ఈ ప్రాంతంలో సంస్కృత విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు.

ఈ విశ్వవిద్యాలయం నలంద, తక్షశిల లాంటి గొప్ప సంప్రదాయంలో భాగంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యనభ్యసించారు. క్రీ. శ 1035లో వసంత పంచమి రోజున సరస్వతి దేవీ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించారు. దాదాపు 271 ఏళ్లు ఈ ప్రదేశం విద్యా కేంద్రంగా ఉంది. ఈ వివాదాస్పద కట్టడం అప్పటి కళల్ని చూపిస్తుంది. మసీదు ప్రాంగణం, స్తంభాలు, గోడలు, పైకప్పుపై ఉన్న చిత్రాలు ఆ నాటి వైభవాన్ని చూపిస్తాయి. సంస్కృత వ్యాకరణానికి సంబంధించిన నామాలు, క్రియలు, కాలాలు, సాహిత్య రచనలు రాతిపై చెక్కబడ్డాయి. విష్ణువు అవతారం అయిన ‘‘కుర్మావతారానికి’’ సంబంధించిన ప్రాకృత స్తోత్రాలు, రాజా అర్జున వర్మ దేవుడి కాలంలో రచించిన ‘కర్పూర మంజరి’ వంటి నాటకాలు ఇక్కడ లభించాయి. కాళిదాసు, బాణభట్టుడు, భవభూతి వంటి మహానుభావులతో ఈ ప్రాంతానికి సంబంధం ఉందని చరిత్ర చెబుతుంది.

ఖిల్జీ దండయాత్రతో మారిన పరిస్థితి:

క్రీ.శ 1305లో అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర మాల్వాలోని పర్మార్ పాలనను అంతం చేసిందని చరిత్ర చెబుతోంది. దీని తర్వాత, భోజ్‌శాల రూపాన్ని మార్చడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. క్రీ.శ 1514లో మహమూద్ షా ఖిల్జీ-2 దీనిని మసీదుగా మార్చడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో, కమల్ మౌలానా సమాధిని ఈ ప్రాంతంలో నిర్మించారు. అయితే, చారిత్రక ఆధారాల ప్రకారం, కమల్ మౌలానా దాని నిర్మాణానికి రెండు దశాబ్ధాలకు ముందే మరణించాడని సూచిస్తున్నాయి.

తవ్వకాల్లో బయపడ్డ సరస్వతి విగ్రహం:

1875లో బ్రిటీష్ అధికారి మేజర్ కింకెడ్ జరిపిన తవ్వకాల్లో సరస్వతి మాతా విగ్రహం బయటపడింది. దీని బ్రిటీష్ వారు లండన్‌కు తరలించారు. నేటికి ఈ విగ్రహం బ్రిటీష్ మ్యూజియంలో ఉంది. 1961లో ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త డా. విష్ణు శ్రీధర్ వాకన్కర్ విగ్రహాన్ని భారత్ తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.

మత ఉద్రిక్తతలకు కేంద్రం:

స్వాతంత్య్రం అనంతరం అనేక పరిపాలన, చట్టపరమైన, మత ఉద్రిక్తతలకు ఈ నిర్మాణం కారణమైంది. 1936 మరియు 1942 మధ్య, ప్రార్థన, ఆరాధనకు సంబంధించి అనేక వివాదాలు ఉన్నాయి. 1995 తర్వాత ప్రార్థనా రోజులు, ప్రార్థన సమయంపై వివిధ వివాదాలతో వివాదం తీవ్రమైంది. 1997లో భద్రతా కారణాల దృష్ట్యా ప్రజలకు ప్రవేశాన్ని పరిమితం చేశారు. 2013, 2016లో వసంత పంచమి, శుక్రవారం కలిసి వచ్చిన సమయంలో మత ఉద్రిక్తతలు పెరిగాయి. ధార్ వీధుల్లో లాఠీ ఛార్జ్, కర్ఫ్యూలు విధించాల్సి వచ్చింది.

Exit mobile version