NTV Telugu Site icon

Akhilesh Yadav: పార్టీలో అన్ని విభాగాలను రద్దు చేసిన అఖిలేశ్ యాదవ్… ఎందుకంటే?

Akhilesh Yadav

Akhilesh Yadav

సమాజ్‌వాదీ పార్టీలోని అన్ని విభాగాలను ఆదివారం రద్దు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఇటీవల రాంపూర్, అజంగఢ్ లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ సమాజ్‌వాదీ పార్టీకి ఘోర పరాజయాలే ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అధినాయకత్వం ఈ ఫలితాలపై తీవ్ర నిరాశకు గురైంది. ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమాజ్ వాదీ పార్టీలో అన్ని పదవులు రద్దు చేశారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి, యూత్, మహిళా విభాగాలను అన్నింటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆ పార్టీ ట్విటర్ వేదికగా వెల్లడించారు.

ఈ భారీ ప్రక్షాళనకు కారణాలేమిటో ఆ పార్టీ వెల్లడించలేదు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల కోసం సమాయత్తమయ్యేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అజంగఢ్, రామ్‌పూర్ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూడటంతో పార్టీని ప్రక్షాళన చేస్తున్నారని భావిస్తున్నారు. అయితే, జాతీయ అధ్యక్ష పదవి కాకుండా మరొక్క పదవిని మాత్రం ఉంచారు. సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్ ఉత్తమ్‌ను మాత్రం కొనసాగిస్తున్నట్టు సమాజ్ వాదీ పార్టీ వర్గాలు తెలిపాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటినుంచి సమాయత్తం అయ్యేందుకు వీలుగా, పార్టీని ప్రక్షాళన చేస్తున్నట్టు ఎస్పీ సీనియర్ నేత వెల్లడించారు.

Read Also: BJP National Executive Meeting: రెండో రోజు బీజేపీ స‌మావేశం.. హెచ్ఐసీసీ వేదికగా..

ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అజంగఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి దినేశ్ లాల్ యాదవ్ గెలిచారు. ఈ స్థానంలో అఖిలేశ్ యాదవ్ బంధువు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్ 8,679 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అంతకుముందు అఖిలేశ్ యాదవ్ ఈ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించేవారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అవసరమైంది. సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత అజం ఖాన్ కూడా ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో, రామ్‌పూర్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి అసిం రజా ఓటమి పాలయ్యారు. ఆయనపై 42,192 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ఘనశ్యామ్ లోఢీ గెలిచారు.

Show comments