Air India Flights Cancelled: యూఎస్‌కు విమానాల రద్దుపై ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది.. అమెరికాలో సంభవించే.. చారిత్రాత్మకంగా నమోదయ్యే అవకాశం ఉన్న శీతాకాల తుఫాను నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఈ ప్రకటన చేసింది. జనవరి 25 మరియు 26 తేదీల్లో.. రేపు, ఎల్లుండి.. రెండు రోజుల పాటు.. న్యూయార్క్, న్యూజెర్సీలోని విమానాశ్రయాలకు వెళ్లే మరియు అక్కడి నుంచి వచ్చే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. ప్రయాణికులు మరియు సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.
Read Also: AP Handicrafts Global Recognition: ఏపీ హస్తకళలకు అంతర్జాతీయ వేదికపై మరో గుర్తింపు
అయితే, అమెరికా తూర్పు తీర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి సోమవారం వరకు భారీ హిమపాతం, గడ్డకట్టే వర్షం, తీవ్రమైన చలి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ (NWS) హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీ సహా పరిసర ప్రాంతాలు ఈ తుఫాను ప్రభావానికి లోనవుతాయని పేర్కొంది. ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన కార్యకలాపాలు తీవ్రంగా అంతరాయం పొందే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ట్రావెల్ అడ్వైజరీ విడుదల చేసింది. “ప్రయాణికులు మరియు సిబ్బంది భద్రత, సౌకర్యం, శ్రేయస్సు దృష్ట్యా యూఎస్ కు సంబంధించి జనవరి 25, 26 తేదీల్లో అన్ని విమానాలను రద్దు చేస్తున్నాం” అని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ప్రయాణికులు తమ ఫ్లైట్ స్టేటస్‌ను ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ లేదా కస్టమర్ సపోర్ట్ ద్వారా తెలుసుకోవాలని సూచించింది.
ఇదిలా ఉండగా, అమెరికా అంతటా శీతాకాల తుఫాను ముప్పు పెరుగుతోంది. సెంట్రల్ ప్లెయిన్స్ నుంచి ఈశాన్య ప్రాంతాల వరకు లక్షలాది మంది ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ మంచు వర్షాలు, తీవ్రమైన చలి కారణంగా రహదారులు మూసివేత, విద్యుత్ అంతరాయాలు, ప్రయాణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. పరిస్థితిని సమీపంగా పర్యవేక్షిస్తున్నామని, అత్యవసర సేవల కోసం FEMAను పూర్తి అప్రమత్తంగా ఉంచామని తెలిపారు. స్థానిక సంస్థలు తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. వాతావరణ నిపుణులు ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలు చేయాలని, అధికారిక వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచిస్తున్నారు. ఎయిర్ ఇండియాతో పాటు పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా అమెరికాలో ప్రభావిత ప్రాంతాలకు తమ విమాన సేవలను పరిమితం చేశాయి లేదా రద్దు చేశాయి.
