ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..

  • 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు..
  • జాబితాలో నాగాలాండ్, బెంగాల్, తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు..
Parliament

Parliament

ADR Report: 2022-2026 మధ్య కాలం నాలుగేళ్లలో పార్లమెంట్, అసెంబ్లీలకు గెలిచిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించినట్లుగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) రిపోర్ట్ వెల్లడించింది. నాగాలాండ్, పశ్చిమ బెంగాల్‌లో అత్యధిక సంఖ్యలో నేతలు పార్టీలు మారినట్లు వెల్లడించింది. 26 మంది లోక్‌సభ ఎంపీలు, ఏడుగురు రాజ్యసభ ఎంపీలు, 78 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారిన వారిలో ఉన్నారు.

అత్యధికంగా 32 కేసులు నాగాలాండ్‌లో నమోదయ్యాయి. అధికార నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (NDPP) మరియు నాగా పీపుల్స్ ఫ్రంట్ (NPF) మధ్య జరిగిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఈ ఫిరాయింపులు చోటుచేసుకున్నాయి. అత్యధిక ప్రజాప్రతినిధుల్ని చేర్చుకున్న పార్టీగా NPF నిలిచింది.

పశ్చిమ బెంగాల్‌లో 20 మంది లోక్‌సభ ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ నుంచి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI)లో చేరారు. దీని తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది. బీఆర్ఎస్‌లో గెలిచిన 9 మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. గోవాలో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఉద్ధవ్ శివసేన నుంచి ఎన్నికైన ఎంపీలు, ఆ తర్వాత ఏక్‌నాథ్ షిండే శివసేనలో చేరారు. మేఘాలయలో ఐదుగురు, మణిపూర్‌లో ముగ్గురు, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్‌లో చెరో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీలు మారారు. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్‌లో ఇద్దరు చొప్పున, కర్ణాటక, మధ్యప్రదేశ్, సిక్కిం, యూపీల్లో ఒక్కో పార్టీ ఫిరాయింపు కేసు నమోదైంది.

పార్టీల పరంగా చూస్తే అత్యధికంగా NDPP నుంచి 25 మంది బయటకు వెళ్లారు. టీఎంసీ నుంచి 20 మంది, కాంగ్రెస్ నుంచి 19 మంది, బీఆర్ఎస్ నుంచి 9 మంది, ఆప్ మరియు ఎన్సీపీల నుంచి చెరో ఏడుగురు, శివసేన నుంచి ఆరుగురు, జేడీయూ నుంచి ఐదుగురు, ఎన్‌పీపీ నుంచి నలుగురు పార్టీలు మారారు. మొత్తంగా NDPP, టీఎంసీ మరియు కాంగ్రెస్ పార్టీల నుండి 111 కేసులలో 64 కేసులు (అంటే 58 శాతం) నమోదయ్యాయి.

పార్టీలు మారిన ప్రజాప్రతినిధులను ఎక్కువగా చేర్చుకున్న పార్టీల్లో NPF అత్యధికంగా 32 మందిని పొందింది, ఆ తర్వాత బీజేపీ 29 మందిని, NCPI 20 మందిని చేర్చుకున్నాయి. . కాంగ్రెస్‌కు తొమ్మిది, శివసేనకు ఎనిమిది, ఎన్‌పిపికి ఆరు, అరుణాచల్ పీపుల్స్ పార్టీలోకి నలుగురు చేరారు. కొన్ని రాష్ట్ర శాసనసభలలో ప్రభుత్వాలు పడిపోవడానికి ఇటీవలి ఫిరాయింపులు కూడా ఒక కారణమని ఏడీఆర్ పేర్కొంది.