A Bihar Woman Gave Birth To Alien Baby: బీహార్‌లో ఒక వింత శిశువు జన్మించింది. ముక్కు స్థానంలో వింత ఆకారంలో రెండు కళ్లు ఉన్నాయి. అలాగే.. ముందవైపున చిన్న ట్రంక్‌లాగా పొడుచుకు వచ్చింది. కానీ.. శ్వాస తీసుకోవడానికి రంధ్రాలు మాత్రం లేవు. బీహార్‌లోని అలీషెర్‌పుర్‌కు చెందిన సరోజ పటేల్, రూపాదేవి దంపతులకు ఈ శిశువు పుట్టింది. వింత ఆకారంతో ఈ శిశువు పుట్టడంతో.. ఏలియన్ పుట్టిందంటూ స్థానికులు ప్రచారం చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. వినాయకుడు పుట్టాడని చెప్పుకుంటున్నారు. ఈ ప్రచారాల సంగతి అటుంచితే.. తల్లిదండ్రుల్లో జన్యుపరమైన లోపాల కారణంగా, క్రోమోజోమ్‌ల లోపాలతో శిశువులు ఇలా పుడతారని వైద్యులు పేర్కొంటున్నారు. దీని వల్ల పిల్లలకు శ్వాస తీసుకోవడం చాలా కష్టమవుతుందని తెలిపారు. ఈ శిశువులో కూడా శ్వాస తీసుకోవడానికి రంధ్రాలు లేకపోవడంతో.. నోట్లో ఆక్సిజన్ పైప్ పెట్టి, చికిత్స అందిస్తున్నారు.
ఈ విషయంపై గైనకాలజిస్ట్ హేమచంద్ర మాట్లాడుతూ.. గర్భం దాల్చిన తర్వాత మహిళలు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కానీ.. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు సకాలంలో ప్రసవ పరీక్షలు చేయించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం సైతం ఎన్నో ఆరోగ్య కేంద్రాలతో పాటు అంగన్‌వాడీ సెంటర్స్‌ని ఏర్పాటు చేసిందని.. వాటిల్లో ఆరోగ్యకరమైన, సురక్షితమైన ప్రెగ్నెన్సీ పద్ధతుల్ని అనుసరిస్తారన్నారు. కానీ.. మహిళలు మాత్రం ఆ కేంద్రాలకు వెళ్లకుండా, సాంప్రదాయ పద్ధతులనే పాటిస్తారని.. ఫలితంగా, గర్భధారణ సమయంలో సమస్యలు వస్తాయని అన్నారు. అలాంటి సమస్యల కారణంగానే ఈ శిశువు కూడా వింతగా పుట్టిందని, ఈ శిశువుకి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి శిశువులు ఎక్కువ కాలం బతకడం కష్టమని వైద్యులు చెప్తున్నారు.
