Site icon NTV Telugu

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో రెండు రైళ్లు ఢీ.. 60 మందికి గాయాలు

Uttarakhand

Uttarakhand

ఉత్తరాఖండ్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగంలో రెండు లోకో రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 60 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 109 కార్మికులు, అధికారులు ఉన్నారని.. ఇందులో 60 మంది గాయపడ్డారని చమోలి జిల్లా మేజిస్ట్రేట్ గౌరవ్ కుమార్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన 10 మందిని చికిత్స కోసం గోపేశ్వర్‌లోని జిల్లా ఆస్పత్రికి పంపినట్లు వెల్లడించారు. అందరూ క్షేమంగా ఉన్నట్లు చెప్పారు.

చమోలి జిల్లాలోని విష్ణుగడ్-పిపల్కోటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. పిపల్కోటి సొరంగం లోపల మంగళవారం సాయంత్రం కార్మికులు, అధికారులతో వెళ్తున్న లోకో రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఒక రైల్లో కార్మికులు, అధికారులు ఉండగా.. ఇంకో రైల్లో సామాగ్రిని తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక ఈ ప్రాజెక్టు 444 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా జరుగుతోంది. అలకనంద నదిపై నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version