కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం డిసెంబర్ 21న జరగనుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో 2025-26 బడ్జెట్‌పై చర్చించనున్నారు. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే సిఫార్సులను ఆర్థికమంత్రిశాఖ స్వీకరించనుంది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సహా ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు.
ఇక కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1, 2025న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. గత బడ్జెట్‌లో ఏపీకి భారీ ఆర్థిక సాయాన్ని కేంద్రం ప్రకటించింది. ఈసారి కూడా ఏదొక సాయం చేయొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో తెలుగు దేశం పార్టీ కీలక రోల్ పోషిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌లో మరొకసారి ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యత దక్కొచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
డిసెంబర్ 21న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్‌తో పాటు పలు కీలక సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. ఆరోగ్యం, బీమాపై జీఎస్టీ మినహాయింపుపై నిర్ణయం తీసుకునే ఛాన్సుంది. అలాగే సాధార వస్తువులపై కూడా పన్ను రేట్ల హేతుబద్ధీకరణను పరిగణించవచ్చని తెలుస్తోంది. రాష్ట్ర మంత్రుల ప్యానెల్ నుంచి వచ్చే సిఫార్సుల ఆధారంగా రేట్లను 12 శాతం నుంచి 5 శాతం వరకు తగ్గించవచ్చని సమాచారం.
గత బడ్జెట్‌లో బీహార్, ఏపీకే కేంద్రం ప్రాధాన్యత ఇచ్చిందంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. మిత్రులను మచ్చిక చేసుకునేందుకు మిగతా రాష్ట్రాలను పట్టించుకోలేదని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. 2025లో ప్రకటించబోయే బడ్జెట్‌లోనైనా ఏవైనా మెరుపులు ఉంటాయేమో చూడాలి.