Uttarakhand tunnel rescue: ఉత్తరాఖండ్ టన్నెల్‌లో చిక్కుకుపోయిన 41 మంద కార్మికులను రక్షించేందుకు ఆపరేషన్ వేగంగా జరుగుతోంది. మరికొన్ని గంటల్లో వారంతా సురక్షితంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. సిల్క్యారా టన్నెల్ నుంచి కార్మికులు బయటకు వచ్చిన వెంటలనే వారికి చికిత్స అందించేందుకు బుధవారం 41 పడకల ఆస్పత్రిని సిద్ధం చేశారు. వీరిని తరలించేందుకు అంబులెన్సులను సిద్ధం చేశారు.
బుధవారం సొరంగంలో రెస్యూ ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అమెరికన్ ఆగర్ మెషిన్ సొరంగం లోపల కూలిపోయిన ప్రదేశంలో పేరుకుపోయిన శిథిలాల గుండా డ్రిల్లింగ్ ప్రారంభించింది. చిక్కుకుపోయిన కార్మికులను రెస్క్యూ చేయడానికి మధ్యాహ్నం నాటికి 45 మీటర్లు చొచ్చుకుపోయింది. 6 మీటర్ల పొడవు కలిగి 800 మిమీ వ్యాసం కలిగిన మరో రెండు ఉక్కు పైపులను వేయడానికి శిథిలాల ద్వారా దాదాపు 12 మీటర్లు తవ్వాలి. జిల్లాలోని అన్ని ఆసుపత్రులతో పాటు ఎయిమ్స్, రిషికేష్ ఆస్పత్రులను హై అలర్ట్ తో ఉంచారు. శిథిలాల అవతలి వైపు చిక్కుకుపోయిన కార్మికులను చేరుకోవడానికి మొత్తం 57 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేయాల్సి ఉంటుంది.
Read Also: Illegal Immigrant : అమెరికా అక్రమ వలసదారుల్లో మూడో స్థానంలో భారతీయులు..
సహాయక చర్యలు పరిశీలించేందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సంఘటన స్థలానికి బయలుదేరారు. ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ కోసం ఆక్సిజన్ మాస్కులతో 21 మంది రెస్క్యూ సిబ్బంది సొరంగంలోకి ప్రవేశించారు. నవంబర్ 12న సిల్క్యారా సొరంగం కూలిపోయింది. అందులో పనిచేస్తున్న 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఉత్తర కాశీ జిల్లాలో బ్రహ్మఖల్-యమునోత్రి జాతీయ రహదారిపై ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. సొరంగం దగ్గర జరుగుతున్న రెస్క్యూ పనుల్ని ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ధామిని అడిగి తెలుసుకుంటున్నారు.
