400 New Vande Bharat Trains To Be Announced In 2023 Union Budget: వచ్చే ఏడాది యూనియన్ బడ్జెట్‌లో భాగంగా.. భారతీయ రైల్వేల బడ్జెట్ కేటాయింపులో 300 నుంచి 400 వరకు కొత్త వందే భారత్ రైళ్లను ప్రకటించే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. 2024 మొదటి త్రైమాసికంలో స్లీపర్ కోచ్‌లతో కూడిన మొదటి వందే భారత్ రైలును విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే.. వచ్చే మూడేళ్లలోపు రైల్వే ట్రాక్‌లపై 475 వందే భారత్ రైళ్ల తీసుకొచ్చేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయని వెల్లడించారు.
‘‘475 వందేభారత్ రైళ్లను ట్రాక్‌లోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యం. గతేడాది బడ్జెట్‌లో 400 రైళ్లు మంజూరవ్వగా.. అంతకుముందు 75 రైళ్లు మంజూరు చేయబడ్డాయి. రాబోయే మూడేళ్లలో మేము మా లక్ష్యాన్ని చేరుకుంటాం’’ అని అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఢిల్లీ – ముంబై, ఢిల్లీ – హౌరా, ఇతర ప్రధాన మార్గాలలో ప్రస్తుతమున్న రాజధాని, దురంతో, శతాబ్దితో పాటు ఇతర సూపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను దశలవారీగా తొలగించి.. వాటి స్థానంలో ఈ వందే భారత్ రైళ్లను తీసుకురావాలనే విజన్‌తో కేంద్రం పని చేస్తోంది. మరోవైపు.. 2025-26 నాటికి యూరప్, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియాలోని మార్కెట్‌లకు వందేభారత్ రైళ్లను ఎగుమతి చేసేందుకు భారతీయ రైల్వేలు ప్రణాళికలు వేస్తున్నాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
కాగా.. ప్రస్తుతం మన దేశంలో ఐదు వందే భారత్ రైళ్లు మాత్రమే సేవలు అందిస్తున్నాయి. ఢిల్లీ-వారణాసి, ఢిల్లీ-జమ్మూ, గాంధీనగర్-ముంబై, అంబ్-అందౌరా-ఢిల్లీ, బెంగళూరు-చెన్నై మార్గాలలో ఈ రైళ్లు తిరుగుతున్నాయి. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైళ్లలో ఎన్నో అత్యాధునిక భద్రతా ప్రమాణాలు ఉన్నాయి. ఇంకా మరెన్నో సదుపాయాలున్న ఈ రైలుకి సంబంధించి.. టికెట్ రేట్లు అధికంగా ఉన్నాయని ప్రయాణికులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
