NTV Telugu Site icon

Uzbekistan Child Deaths: చిన్నారుల మరణాలకు కారణం అయిన దగ్గుమందు కేసులో ముగ్గురి అరెస్ట్..

Cough Syrup

Cough Syrup

Uzbekistan Child Deaths: గతేడాది భారతీయ తయారీ దగ్గుమందు వల్ల ఉజ్బెకిస్థాన్ దేశంలో 18 మంది పిల్లలు మరణించారు. ఢిల్లీకి చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ కారణంగానే పిల్లలు మరణించినట్లు ఉబ్జెకిస్థాన్ ఆరోపించింది. ఈ కేసులో కంపెనీకి చెందిన ముగ్గురు ఉద్యోగులను శుక్రవారం నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సిఓ) డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు మేరకు మారియన్ బయోటెక్‌కు చెందిన ఇద్దరు డైరెక్టర్లు సహా ఐదుగురు అధికారులపై గురువారం అర్థరాత్రి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత అరెస్టులు జరిగాయి.

Read Also: Russia: ఉక్రెయిన్లపై ఆత్మాహుతి దాడికి పుతిన్ ప్లాన్..!

కేంద్ర, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర అధికారులు మారియన్ బయోటెక్ డ్రగ్స్ తయారీ సంస్థను తనిఖీ చేశారు. దీంట్లో 22 ప్రామాణిక నాణ్యత లోపాలను గుర్తించారు. ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయగా.. కంపెనీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు పరారీలో ఉన్నారు. అరెస్ట్ అయిన వారిలో ఆపరేషన్ హెడ్ తుహిన్ భట్టాచార్య, మాన్యుఫ్యాక్టరింగ్ కెమిస్ట్ అతుల్ రావత్, అనలిటికల్ కెమిస్ట్ మూల్ సింగ్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

మారియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గుమందు డాక్-1 మాక్స్ సేవించి పిల్లలు మరణించినట్లుగా ఉజ్బెకిస్థాన్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలపై భారత ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ సిరప్ లో విషపూరితమైన ఇథిలిన్ గ్లైకాల్ ఉన్నట్లు ప్రయోగశాల్లో తేలినట్లు అక్కడి మంత్రిత్వ శాఖ తెలిపింది. స్థానిక ఫార్మాసిస్ట్ సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండానే పిల్లలకు మందు ఇచ్చారని.. మోతాదుకు మించి మందు వాడటం కూడా మరణాలకు కారణం అయినాయనని పేర్కొంది. అంతకుముందు గాంబియా దేశంలో కూడా భారత ఫార్మా సంస్థ తయారు చేసిన దగ్గుమందు వల్ల 70 మంది పిల్లలు మరణించారు. దీనికి కూడా భారత్ లోని హర్యానాకు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన దగ్గు సిరప్‌ కారణం అని ఆ దేశం ఆరోపించింది.