NTV Telugu Site icon

Gujarat Cable Bridge: గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ఘటన.. 132కి చేరిన మృతుల సంఖ్య

Gujarat Bridge Collapse

Gujarat Bridge Collapse

132 Members Died In Gujarat Morbi Cable Bridge Incident: గుజరాత్‌లోని మోర్బీలో కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనలో మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకూ ఈ ప్రమాదంలో 132 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈ ఘటన సంభవించిన సమయంలో ఆ కేబుల్ బ్రిడ్జ్‌పై సుమారు 500 మంది ఉన్నట్లు సమాచారం. 177 మందిని రెస్క్యూ చేయగా, తీవ్ర గాయాలపాలైన 19 మంది చికిత్స పొందుతున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ బ్రిగేడ్ బృందాలు సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయని గుజరాత్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. నదిలో పడిన ప్రజల్ని కాపాడేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రాత్రి నుంచి పని పని చేస్తోంది. రాత్రి 3 గంటల సమయంలో భారత ఆత్మీ సంఘటనా స్థలానికి చేరుకొని, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తోందని మేజర్ గౌరవ్ స్పష్టం చేశారు. తాము మృతదేహాల్ని రికవర్ చేస్తున్నామని, ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కూడా సహాయక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.

కాగా.. కొన్ని రోజుల క్రితమే వంతెనకు మరమ్మతులు చేసిన అధికారులు, అక్టోబర్ 26న గుజరాతీ కొత్త సంవత్సరం సందర్భంగా తిరిగి ప్రారంభించారు. ఆదివారం కావడంతో కేబుల్ బ్రిడ్జ్‌ని, నదీ అందాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. పరిమితికి మించి జనాలు ఎగబడ్డంతో, ఈ వంతెన కూలినట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే కొంతమంది నది నుంచి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ.. మరణించిన వారికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. అంతేకాదు.. గుజరాత్, రాజస్థాన్‌లో నిర్వహించాల్సిన తన మూడు రోజుల పర్యటనని కూడా రద్దు చేసుకున్నారు. అటు, ఈ ఘటనకు పూర్తి బాధ్యత తీసుకున్న గుజరాత్ ప్రభుత్వం తరుపున సీఎం భూపేంద్ర పటేల్ కూడా మరణించిన వారికి రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన గుజరాత్ హోం మినిస్టర్ హర్ష్ సంఘ్వీ.. ఈ వ్యవహారంపై ఒక క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఐజీపీ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.