Site icon NTV Telugu

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రకు కేవలం ఆరు రోజుల్లోనే 1.30 లక్షల మంది భక్తులు..

Amrnath Yatra

Amrnath Yatra

Amarnath Yatra: సౌత్ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం అమర్‌నాథ్ గుహలో ఆ పరమ శివుడ్ని సందర్శించే వారి సంఖ్య రోజు రోజుకి భారీగా పెరిగిపోతుంది. యాత్ర ప్రారంభమైన కేవలం ఆరు రోజుల్లోనే రికార్డు స్థాయిలో దాదాపు 1. 30 లక్షల కంటే ఎక్కువ మంది భక్తులు మంచు రూపంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకున్నారు. కాగా, గురువారం ఒక్క రోజే 24 వేల మంది యాత్రికులు ఆ పరమేశ్వరుడిని దర్శనం చేసుకోగా.. బుధవారం 30 వేల మందికి పైగా భక్తులు నీలకంఠుడిని దర్శించుకునేందుకు వచ్చారు.

Read Also: Viral Video: డ్రైవర్ లేకుండా ఉన్నట్లుండి స్టార్ట్ అయిన బస్సు.. పెట్రోల్ పంపు కార్మికుడు మృతి

అయితే, శుక్రవారం ఉదయం ఎనిమిదో బ్యాచ్‌లో 6, 919 మంది యాత్రికులు జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ బేస్ క్యాంప్ నుంచి సెంట్రల్ కశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలోని బల్తాల్, అనంత్‌నాగ్ జిల్లాలోని నున్వాన్- పహల్గామ్ జంట బేస్ క్యాంపుల వైపు కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య బయలుదేరి వెళ్లారు. జమ్మూ అండ్ కశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో అమర్ నాథ్ యాత్ర మార్గంలో అడుగడుగున భద్రతా దళాలను భారీగా మోహరించాయి. ఈ ఏడాది జూన్ 29న ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 19వ తేదీతో దాదాపు 52 రోజుల పాటు కొనసాగనుంది. గత ఏడాది 2023లో 4.5 లక్షల మందికి పైగా భక్తులు అమర్‌నాథ్ యాత్రకు వచ్చారు.. కానీ, ఈ సారి అంతకంటే ఎక్కువ మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు.

Exit mobile version