Sanjeev Megoti: వెంకట్ కిరణ్, శ్రీజిత ఘోష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎర్రగుడి’. ‘అమ్మవారి సాక్షిగా అల్లుకున్న ప్రేమకథ’ అనేది ట్యాగ్ లైన్. అన్విక ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మితమౌతున్న ఈ సినిమాకు సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ జర్నలిస్ట్ ప్రభు క్లాప్ కొట్టగా, నిర్మాత జేవీఆర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ, ”ఈ కథ 1975లో మొదలై, 1992తో పూర్తవుతుంది. గ్రామీణ నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న ప్రేమకథ ఇది. లవ్, సెంటిమెంట్, స్పిరిచ్యువల్ అంశాలు ఇందులో ఉంటాయి. ఆదిత్య ఓం, సత్యప్రకాశ్, ఎస్తేర్, సమ్మెట గాంధీ, అజయ్ ఘోష్ లాంటి సీనియర్ నటీనటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరిందరి సహకారంతో మార్చి నెలాఖరుకల్లా మూవీని పూర్తి చేస్తాం” అని చెప్పారు.
‘పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో నటించడం ఎంతో ఆనందంగా ఉంద’ని హీరో వెంకట్ కిరణ్, హీరోయిన్ శ్రీజిత ఘోష్ అన్నారు. ‘దర్శకుడు సంజీవ్ మేగోటి మల్టీటాలెంటెడ్ పర్సన్ అని, తనకు ఇందులో కొత్త తరహా పాత్రను ఇచ్చార’ని సీనియర్ నటుడు సమ్మెట్ గాంధీ చెప్పారు. నిర్మాణ సారధి ఘంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ”పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో ‘ఎర్రగుడి’ సినిమా నిర్మాణం చేపట్టాం. కమర్షియల్ గా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది” అని అన్నారు. లైన్ ప్రొడ్యూసర్ ఆర్.డి.యస్. ప్రకాశ్ మాట్లాడుతూ, ”దర్శకుడు సంజీవ్ మేగోటికి ఇది 12వ సినిమా. అన్ని ఎమోషన్స్ చక్కగా కుదిరిన సినిమా ‘ఎర్రగుడి’. మా టీమ్ అందరం గట్టి ప్రయత్నం చేస్తున్నాం. మంచి ఫలితం వస్తుందని నమ్ముతున్నాం” అని చెప్పారు. త్వరలో సంజీవ్ మేగోటితో తాను ఓ సినిమా నిర్మించబోతున్నానని జేవీఆర్ అన్నారు. ఈ రోజు నుండే సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెడుతున్నట్టు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గోరెంట శ్రావణి తెలిపారు.