పర్వతాలను అధిరోహించడం అనేది ఒక కల. ప్రపంచం లో చాలామంది ఈ ఫీట్ చేస్తూ గిన్నిస్ రికార్డులకు ఎక్కారు. రికార్డులకు మాత్రమే కాదు వారి అభిరుచుల కొరకు వారు ఈ విధంగా చేస్తుంటారు. ఇలాంటి రంగంలో ఒక తెలుగు కుర్రాడు ఉండడం విశేషమనే చెప్పాలి. తెలంగాణ లోని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన యశ్వంత్ ఈ విధంగా పలు ఘనతలను సాధించాడు.
తాజాగా రష్యాలో అత్యధిక ఎత్తు కలిగిన ఎల్బర్స్ పర్వతాన్ని అధిరోహించాలని భావించాడు. అయితే తన ప్రయాణానికి నిధుల లేమి అడ్డంకిగా మారింది. ఈ క్రమంలో కళలను పోషించాలనే ఉద్దేశ్యంతో ఈ యువకుడికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు ప్రముఖ హీరో, వ్యాపారవేత్త అభినవ్ సర్దార్. ‘ది ఘోస్ట్ రిసార్ట్, రాక్షసి, మాగ్నెట్, రామ్ అసుర్’ వంటి పలు సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న అభినవ్ సర్దార్ ఇప్పుడు కూడా కొన్ని మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. మొదటి నుంచి ఆయన కళాకారులను పోషించే తత్వం ఉన్న వ్యక్తి. అందులో భాగంగానే యశ్వంత్ కు సహాయం చేసి ఓ మంచి పనికి పునాది వేశాడు. దేశం ప్రతిష్టను విదేశీ గడ్డపై నిలిపేందుకు తన వంతు సహాయం చేశాడు.
