The Paradise: నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో ఇప్పటివరకు చూడని మాస్ అవతార్‌లో కనిపించబోతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ‘దసరా’తో నానికి భారీ హిట్ అందించిన శ్రీకాంత్ ఓదెల మరోసారి దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై మొదటి నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికి తోడు అనిరుధ్ రవిచందర్ అందించిన ‘ఆయా షేర్’, ‘యేశ నాగుల కట్టమీద’ వంటి మాస్ సాంగ్స్ ఇప్పటికే సినిమాపై బజ్‌ను మరింత పెంచాయి. ఇప్పటికే ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి మార్పు ఉండకూడదనే ఉద్దేశంతో చిత్రబృందం పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ ప్రకటించిన ప్రకారం సెప్టెంబర్ 24న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారని సమాచారం.
ఈ సినిమాకు సంబంధించిన 1 నిమిషం 35 సెకన్ల నిడివి గల టీజర్ ను 2026 ఆగస్టు 6న విడుదల చేయగా, దానికి ప్రేక్షకుల నుండి రగ్గడ్ మాస్ రెస్పాన్స్ లభించింది. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ఎల్‌వి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్‌గానే మేకర్స్ రిలీజ్ డేట్‌పై ఉన్న పుకార్లకు చెక్ పెడుతూ, అనుకున్న సమయానికే (సెప్టెంబర్ 24న) సినిమా వస్తుందని, సెప్టెంబర్ 23 రాత్రి నుంచే స్పెషల్ ప్రీమియర్స్ పడతాయని సరికొత్త వీడియోతో కన్ఫర్మ్ చేశారు. అయితే ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ డేట్ ను మేకర్స్ ఇంకా ఆఫీషియల్ గా ప్రకటించలేదు. రిలీజ్ కు దగ్గర పడుతుండటంతో అభిమానులు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 15 నుండి 18 మధ్యలో ఒక భారీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం వస్తోంది.
అయితే సినిమాకు సంబంధించిన మరో వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా భారీ సినిమాలకు రిలీజ్‌కు ముందు ట్రైలర్‌తో విపరీతమైన హైప్ తీసుకొస్తారు. కానీ ‘ది ప్యారడైజ్’ విషయంలో మాత్రం ట్రైలర్‌ను విడుదల చేయకుండా నేరుగా సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ నిజంగానే ట్రైలర్ లేకుండా సినిమాను విడుదల చేస్తే, ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెంచే అవకాశం ఉంది. గతంలో కూడా కొన్ని సినిమాలు ట్రైలర్‌ను పూర్తిగా పక్కన పెట్టి నేరుగా థియేటర్లలోకి వచ్చాయి. కథలోని కీలక అంశాలు ముందుగానే బయటకు రాకుండా చూసేందుకు, ప్రేక్షకులకు థియేటర్‌లోనే పూర్తి అనుభూతిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి వ్యూహాన్ని కొందరు మేకర్స్ అనుసరించారు. మరి ‘ది ప్యారడైజ్’ లాంటి భారీ యాక్షన్ మూవీకి కూడా ఇదే విధానం మేకర్స్ అమలు చేస్తారా ? ట్రైలర్ లాంచ్ తోనే ముందుకు సాగుతారా ? అనేది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.

