Michael Jackson: పాప్ సంగీత ప్రపంచాన్ని తనదైన స్టైల్ తో శాసించిన మైఖేల్ జాక్సన్‌కు మరో విషయంలో కూడా విపరీతమైన ఆసక్తి ఉండేదట. అది సంగీతం అయితే కాదులెండి.. అది మార్వెల్ సూపర్‌హీరోల ప్రపంచం. ఈ ప్రపంచంలో స్పైడర్ మ్యాన్ అంటే మైఖేల్‌కు ఎంతో ఇష్టమని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతేకాదు ఒక దశలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మార్వెల్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచన కూడా మైఖేల్‌కు వచ్చిందనే విషయం ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చింది. అసలు మైఖేల్ మార్వెల్‌ను ఎందుకు కొనాలనుకున్నారు? స్పైడర్ మ్యాన్ పాత్రను స్వయంగా పోషించాలనే కోరిక ఆయనకు నిజంగానే ఉందా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1990వ దశకం మార్వెల్‌కు కలిసొచ్చే కాలంగా కనిపించలేదు. కామిక్ పుస్తకాల అమ్మకాలు క్రమంగా తగ్గిపోవడంతో పాటు సంస్థ అప్పుల్లో కూడా కూరుకుపోయింది. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే 1996లో మార్వెల్ దివాలా కోసం దరఖాస్తు కూడా చేసుకుంది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నుంచి సంస్థ షేర్లను కూడా తొలగించారు. టెలివిజన్, లైసెన్సింగ్ వంటి వ్యాపారాలు కూడా బలహీనపడ్డాయి. చివరకు 1998లో టాయ్ బిజ్‌తో విలీనం కావడం ద్వారా మార్వెల్ తన ఉనికిని కాపాడుకోగలిగింది. అదే సమయంలో మైఖేల్ జాక్సన్ ఈ పరిస్థితిని ఒక అవకాశంగా చూసినట్లు ఆయన మేనల్లుడు తాజ్ జాక్సన్ వెల్లడించారు. తాజ్ జాక్సన్ తెలిపిన వివరాల ప్రకారం, తన సోదరులతో కలిసి ఉన్న సమయంలో మైఖేల్ మార్వెల్‌ను కొనుగోలు చేయడం గురించి చర్చించేవారు. ఈ ప్రయత్నంలో మార్వెల్ లెజెండ్ స్టాన్ లీతో కలిసి పనిచేయాలనే ఆలోచన కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు. అయితే ఈ చర్చలు చివరకు ఒప్పందంగా మారలేదు. మైఖేల్ ఆ ప్రయత్నం ఎందుకు విఫలమైందో తనకు పూర్తిగా తెలియదని తాజ్ పేర్కొన్నారు.
అయితే మైఖేల్ ఆసక్తి కేవలం మార్వెల్ సంస్థను సొంతం చేసుకోవడం వరకే పరిమితం కాలేదట. ఆయనకు మార్వెల్ పాత్రలన్నింటిపై మంచి అవగాహన ఉండేదని తాజ్ తెలిపారు. ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ అంటే మైఖేల్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉండేదని చెప్పారు. అందుకే స్పైడర్ మ్యాన్ హక్కులను పొందడంతో పాటు, తానే ఆ సూపర్‌హీరో పాత్రలో కనిపించాలనే ఆలోచన కూడా మైఖేల్‌కు ఉండేదని వెల్లడించారు. ఇక్కడే ఈ కథ మరింత ఆసక్తికరంగా మారింది. ప్రపంచ వేదికపై మైఖేల్ జాక్సన్‌కు ఉన్న ప్రత్యేకమైన ఇమేజ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ఆయన స్పైడర్ మ్యాన్‌గా కనిపించే ఆలోచన అప్పట్లో నిజమై ఉంటే అది హాలీవుడ్‌లో ఎంతటి సంచలనంగా మారేదో ఊహించుకోవచ్చు. అయితే ఆ కల కార్యరూపం దాల్చలేదు. మార్వెల్ కూడా మరో మార్గంలో ముందుకు సాగింది.
ఇక సినిమా ప్రపంచంలో మార్వెల్ తిరిగి తన ప్రభావాన్ని1998లో ‘బ్లేడ్’ సినిమాతో పెంచుకుంది. ఆ తర్వాత 2000లో ‘ఎక్స్ మెన్’ విడుదలై సూపర్‌హీరో సినిమాలకు కొత్త ఊపునిచ్చింది. 2002లో సామ్ రైమి దర్శకత్వంలో టోబీ మాగ్వైర్ పీటర్ పార్కర్‌గా నటించిన ‘స్పైడర్ మ్యాన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా విజయంతో స్పైడర్ మ్యాన్ పాత్రకు ప్రపంచవ్యాప్తంగా మరింత భారీ గుర్తింపు లభించింది. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ మరోసారి బ్రాండ్ న్యూ డే సినిమాతో థియేటర్లలోకి వచ్చిన నేపథ్యంలో మైఖేల్ జాక్సన్‌కు సంబంధించిన ఈ పాత కథ మళ్లీ తెరపైకి వచ్చింది. మార్వెల్‌ను కొనాలనుకున్న పాప్ స్టార్, స్పైడర్ మ్యాన్‌గా మారాలనుకున్న మైఖేల్ లోని భిన్నమైన మరో కోణాన్ని తెలుసుకుని అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అప్పట్లో ఆ చర్చలు ఫలించి ఉంటే, మార్వెల్ చరిత్రతో పాటు స్పైడర్ మ్యాన్ సినిమా చరిత్ర కూడా పూర్తిగా మరోలా ఉండేదేమో.

