Site icon NTV Telugu

The Elephant Whisperers: ఆస్కార్ విన్నింగ్ డాక్యుమెంటరీ గొప్పతనమేంటి!?

Ele

Ele

Oscar: ఈ యేడాది భారత్ కు చెందిన మూడు చిత్రాలు ఆస్కార్ బరిలో వివిధ కేటగిరిల్లో నిలిచాయి. అందులో రెండు సినిమాలు ఆస్కార్ ట్రోఫీని అందుకున్నాయి. మన వాళ్ళంతా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ ను సొంతం చేసుకున్న ‘ఆర్.ఆర్.ఆర్.’ మూవీ గురించి, ‘నాటు నాటు’ సాంగ్ గురించి ముచ్చటించుకుంటున్నారు. అయితే… నలభై నిమిషాల నిడివి ఉన్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ మూవీ కూడా తక్కువదేమీ కాదు. ఈ కేటగిరిలోని మిగిలిన నాలుగు డాక్యుమెంటరీస్ దీనికి గట్టి పోటీని ఇచ్చినా… ఇదే ఆస్కార్ విన్నర్ గా నిలిచింది. జ్యూరీ సభ్యులు ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ కు ఓటు వేయడంతో గునీత్ మోంగా, కార్తికి గోన్సాల్వేస్ ఆస్కార్ ప్రతిమను సగర్వంగా ఈ రోజు ఉదయం వేదికపై అందుకున్నారు.

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ లిస్ట్ లో అమెరికన్ కు చెందిన మూడు సినిమాలు ఉన్నాయి. ‘స్ట్రేంజర్ ఎట్ ది గేట్’ అనే 29 నిమిషాల డాక్యుమెంటరీ ఆఫ్ఘన్ శరణార్దికి చెందింది. బిబి బహ్రామీ అనే శరణార్థి ఇండియానాలోని ఓ మసీదులో తన వాళ్ళతో తలదాచుకున్న సంఘటన నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని జోషువ సెఫ్టెల్ తెరకెక్కించాడు. అలానే ‘హౌ డు యూ మెజర్ ఏ ఇయర్!?’ అనే అమెరికన్ డాక్యుమెంటరీలో తండ్రీ – కూతుళ్ళ అనుబంధాన్ని దర్శకుడు జయ్ రోజన్ బ్లట్ చూపించాడు. ఇక మూడోది ‘ది మార్త మిఛెల్ ఎఫెక్ట్’ అమెరికన్ పొలిటికల్ సిస్టమ్ లోని ఓ చీకటి కోణానికి సంబంధించింది. ఈ మూడింటి కంటే ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ కు గట్టిపోటీ ఇచ్చిన డాక్యుమెంటరీ ‘హాలౌట్’. రష్యన్, బ్రిటిష్ సంస్థలు నిర్మించిన ఈ డాక్యుమెంటరీ రష్యన్ సైంటిస్ట్ మాగ్జిమ్ చక్లివ్ వాల్రాస్ గురించి చేసిన పరిశోధనకు సంబంధించింది. వాల్రాస్ ను కొన్ని చోట్ల నీటి గుర్రాలని, నీటి కుక్కలని కూడా అంటారు. ఆ జాతి మనుగడకు సంబంధించిన విశేషాలతో ఈ డాక్యుమెంటరీ సాగింది. అయితే… ఈ నాలుగు డాక్యుమెంటరీలను కాదని ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు జ్యూరీ సభ్యులు పట్టం కట్టారు.

ఇంతకూ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’లో ఏం ఉంది!? ఇది రెండు ఏనుగు పిల్లలను పెంచిన ఓ జంట కథ. ముదుమలై పులుల అభయారణ్యంలో ఈ కథ జరిగింది. ఆ అడవి నుండి కొన్ని ఏనుగులు, వాటి పిల్లలు దారి తప్పి, గ్రామాల్లోకి వచ్చేస్తుంటాయి. అలాంటి వాటిని తిరిగి గుంపులో కలిపే ప్రయత్నం చేస్తుంటారు. అయితే కొన్ని అలా తిరిగి అడవిలోకి వెళ్ళవు. అలాంటి వాటి కోసం ఏనుగుల పునరావాస కేంద్రాన్ని అటవీ శాఖ ఏర్పాటు చేసింది. అందులో రఘు అనే అనాథ ఏనుగు పిల్లను సాకే పనిని బొమ్మన్ కు అధికారులు అప్పగిస్తారు. అతనికి సాయంగా బెల్లిని నియమిస్తారు. బెల్లికి అప్పటికే ఓ కూతురు పుట్టి చనిపోతుంది. దాంతో ఈ ఏనుగు పిల్లనే తన కూతురులా ఆమె భావిస్తుంటుంది. కొంతకాలానికి రఘుతో పాటు అమ్ము అనే మరో ఏనుగు పిల్లనూ వారు పెంచాల్సి వస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు రఘును అటవీ శాఖ అధికారులు వేరే చోటుకు తరలిస్తారు. దాదాపు నాలుగైదేళ్ళ పాటు పెంచిన ఏనుగు పిల్లను విడిచి పెట్టడానికి ఆ దంపతులు ఎలాంటి మానసిక సంఘర్షణకు గురయ్యారో ఈ డాక్యుమెంటరీలో రికార్డ్ చేశారు. బెల్లిని ఆ చుట్టుపక్కల వారు ‘ఏనుగుల తల్లి’ అని పిలుస్తుంటారు. విశేషం ఏమంటే… బొమ్మన్, బెల్లి ఇద్దరూ కూడా తమ తర్వాత తరానికి కూడా ఏనుగులను ఎలా సాకాలో నేర్పుతుంటారు. గిరిజన తండాలోని గుడిలో పూజారిగా వ్యవహరించే బొమ్మన్ ‘దేవుడి లానే తాను ఏనుగు పిల్లలను చూసుకుంటుండే వాడిన’ని చెబుతాడు.

ఇటీవల మన దేశంలో చిరుత పులుల కొరత ఏర్పడటంతో విదేశాల నుండి ప్రత్యేక విమానంలో వాటిని కేంద్ర ప్రభుత్వం తెప్పించింది. ప్రకృతిలోని సమస్త జీవరాశుల మధ్య ఓ బంధం ఉంటుంది. అందులో కొన్ని జాతులు కనుమరుగైతే… సమతుల్యత దెబ్బతింటుంది. నిజానికి ఏనుగులు లేని అడవులను ఎవరైనా ఊహించగలరా!? ఇదే ప్రశ్న ఈ డాక్యుమెంటరీ మేకర్స్ వ్యూవర్స్ కు వేస్తారు. సమస్త జీవరాశులలో భగవంతుడిని చూడమనే గొప్ప భావన ఉండబట్టే… ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ గా ఆస్కార్ కు ఎంపికైంది.

Exit mobile version