NTV Telugu Site icon

రివ్యూ: పాగల్

Vishwaksen's Paagal Movie Review

గత యేడాది విశ్వక్ సేన్ నటించిన ‘హిట్’ మూవీ ఫిబ్రవరి నెలాఖరులో విడుదలైంది. ఆ తర్వాత నెల రోజులకే కరోనాతో థియేటర్లు మూతపడిపోయాయి. దాంతో ‘హిట్’ సక్సెస్ క్రెడిట్ ను పూర్తి స్థాయిలో హీరో విశ్వక్ సేన్ తో పాటు దర్శక నిర్మాతలు పొందలేదనే చిన్నపాటి వెలితి అందరికీ ఉండేది. అందువల్లే, కరోనా సెకండ్ వేవ్ తర్వాత వస్తున్న విశ్వక్ సేన్ ‘పాగల్’ మూవీపై రిలీజ్ కు ముందే పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. మరి ఆ ‘పాగల్’…. ప్రేక్షకులను మెప్పించాడో లేదో తెలుసుకుందాం.

ప్రేమ్ (విశ్వక్ సేన్) సింగిల్ పేరెంట్ సన్. తల్లి (భూమిక)కి అతనింటే ప్రాణం. పిల్లాడు కూడా తల్లే లోకంగా బతుకుతుంటాడు. అలాంటి సమయంలో క్యాన్సర్ కారణంగా ప్రేమ్ కు పదేళ్ళ వయసులోనే తల్లి కన్నుమూస్తుంది. అయితే… ఆమె కొడుక్కి ఒక్కటే మాట చెబుతుంది ‘ఎదుటి వారిని మనం ఎంత బాగా ప్రేమిస్తే… అంతే గొప్ప ప్రేమను తిరిగి మనకు దక్కుతుంది’ అని. అదే ప్రేమ్ కు వేదవాక్కుగా మారిపోతుంది. యుక్తవయసు రాగానే ఎదుటి వారి ప్రేమ పొందాలంటే… ఇల్లు, వాకిలితో పాటు ఉద్యోగం కూడా ఉండాలనే విషయం అతనికి బోధపడుతుంది. వాటిని సంపాదిస్తాడు. సముద్రమంత విశాలమైన ప్రేమను పంచేవారు వైజాగ్ లో ఉంటారని తెలిసి అక్కడకు వెళతాడు ప్రేమ్. అక్కడే తన లవ్ ట్రయల్స్ మొదలు పెడతాడు. తల్లిని ప్రేమించినంత గొప్పగా… భార్యనూ ప్రేమించాలని అనుకున్న ప్రేమ్ కల నెరవేరిందా? ఆ క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలేమిటీ? అతని వల్ల ఇతరులు ఎదుర్కొన్న సమస్యలేమిటీ? అనేదే మిగతా కథ.

ప్రేమ కోసం పాకులాడే అనాథల కథలు గతంలో చాలానే వచ్చాయి. కన్నవారిని కోల్పోయిన తర్వాత సున్నిత మనస్కులుగా తయారు కావడం, ప్రేమకోసం పరితపించడం, దాన్ని దక్కించుకోవడం కోసం ఉన్మాదులుగా మారడం… వంటి కథలూ మనం సిల్వర్ స్క్రీన్ మీద చూశాం. ఇది కూడా ఒక రకంగా అలాంటి ప్రేమ్ పాగల్ కథే! సినిమా ప్రథమార్ధం అంతా ప్రేమ కోసం పరితపించే హీరో చుట్టూనే తిరుగుతుంది. అయితే ఇంటర్వెల్ కు కాస్తంత ముందు ప్రేమ్ పొలిటీషియన్ రాజిరెడ్డి చుట్టూ ‘లవ్ యూ’ అంటూ తిరగడం ఆడియెన్స్ కు ఊహించని షాకే! దానికి పూర్తి భిన్నంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది. ఓ చిన్న సస్పెన్స్ తో సెకండ్ హాఫ్ మొదలవుతుంది. అక్కడ నుండి కథ ఫ్లాష్ బ్యాక్ లో సాగుతుంది. చివరకు హీరో చర్యకు జస్టిఫికేషన్ చేస్తూ, శుభం కార్డు వేస్తారు.

ప్రేమ పుట్టడానికి లాజిక్ ఉండదు. నిజానికి లాజిక్ తో పుట్టేది ప్రేమే కాదనే వాదన కూడా ఉంది. కానీ ఇక్కడ హీరో ‘నన్ను ప్రేమించండి మొర్రో’ అంటూ అమ్మాయిల వెంటపడటంలో ప్రేమ లేదు… సరికదా ప్రేమను కోరుకునే పిచ్చితనం మాత్రమే ఉంది! ఆ రకంగా ఇది పిచ్చోడి కథ అని చెప్పాలి. ఇక ద్వితీయార్థంలో హీరో, హీరోయిన్ల మధ్య పరిచయం, అది ప్రేమగా మారడం, ఆరు నెలల ప్రేమ నటన… ఇవన్నీ ప్రేక్షకులను పిచ్చోళ్ళను చేసేలా ఉన్నాయి. ఓ వ్యక్తిలో మార్పు తీసుకురావడం కోసం హీరో చేసింది కూడా పిచ్చి ప్రయత్నంగానే అనిపిస్తుంది. ఇక ప్రథమార్థంలో లావుపాటి అమ్మాయికి, హీరోకి మధ్య సాగే ‘అరుపుల ప్రేమ’ చూస్తుంటే ప్రేక్షకులకు టైమ్ మిషన్ లో పాతికేళ్ళ వెనక్కి వెళ్ళామా అనే భావన కలుగుతుంది. దీన్ని కామెడీగా తీసుకుంటారని దర్శక నిర్మాతలు భావించి ఉండొచ్చు. కానీ అది బెడిసి కొట్టింది. అయితే ఆ ఎపిసోడ్ లో మహేశ్ ఆచంట పంచ్ డైలాగ్స్ కాస్తంత రిలీఫ్ ను కలిగించాయి. ‘పాగల్’ టైటిల్ కు జస్టిఫికేషన్ అన్నట్టుగా కథ వైజాగ్ లో జరిగినట్టు చూపడం బాగుంది!

నటీనటుల విషయానికి వస్తే… లవర్ బోయ్ గా విశ్వక్ సేన్ ను ఊహించుకోవడం కొంచం కష్టమే. అయితే… ఆ పాత్రలో ఇమిడిపోవడానికి విశ్వక్ మాగ్జిమమ్ ట్రై చేసినట్టు అతని మేకోవర్ తెలియచేస్తోంది. ‘హిట్’ లాంటి సూపర్ కాప్, యాక్షన్ మూవీ తర్వాత ఇలాంటి లవ్ స్టోరీని, క్యారెక్టర్ ను అతను చేస్తాడనే భావన చాలామందికి రాదు. ప్రేక్షకులను మెంటల్ గా ఎంత ప్రిపేర్ చేసినా… ఇలాంటి కథలను మాత్రం అతని నుండి ఎక్స్ పెక్ట్ చేయరు. దానిని విశ్వక్ సేన్ గ్రహించి, కాస్తంత మాస్ అండ్ రఫ్ అండ్ టఫ్ క్యారెక్టర్లు చేస్తేనే బెటర్. ఇక హీరోయిన్ నివేతా పేతురాజ్ ఎంట్రీనే సెకండ్ హాఫ్ లో ఉంటుంది. ఆ పాత్రను పండించడానికి తనవంతు కృషి తాను చేసినా… కథ, సన్నివేశాల్లో బలం లేకపోవడం వల్ల ‘తీర’ పాత్ర ప్రేక్షకుల హృదయ తీరాలను చేరలేకపోయింది. ప్రథమార్ధంలో హీరో లవ్ ఇంట్రస్ట్ గా సిమ్రాన్ చౌదరి, మేఘా లేఖ ఫర్వాలేదనిపించారు. ప్రేమ్ తల్లిగా భూమిక నటించడంతో వారిద్దరి పాత్రలకు బలమైన పునాది ఏర్పడినట్టు అయ్యింది. వారిపై చిత్రీకరించిన మదర్ సెంటిమెంట్ సాంగ్ కూడా బాగుంది. ఇక హీరో స్నేహితులుగా మహేశ్ అండ్ టీమ్, అలానే వైజాగ్ ఎం.వి.పి. కాలనీ రౌడీ బ్యాచ్ టీమ్ లీడర్ గా రాహుల్ రామకృష్ణ కొంత వినోదం పండించే ప్రయత్నం చేశారు. మురళీ శర్మ ను సరిగా ఉపయోగించు కోలేదనిపిస్తుంది.

ఈ చిత్రానికి రథన్ చక్కని స్వరాలు అందించాడు. కృష్ణకాంత్ రాసిన ‘ఈ సింగిల్ చిన్నోడే’ పాట సందర్భానుసారంగా పలు చోట్ల వస్తుంది. మిగిలిన పాటల పిక్చరైజేషన్ బాగానే ఉంది. లియోన్ జేమ్స్ నేపధ్య సంగీతం ఓకే. అయితే గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండాల్సింది. సన్నివేశాల చిత్రీకరణలో దర్శకుడు నరేశ్ కుప్పిలి అపరిపక్వత కనిపిస్తోంది. కథలో బలం లేకపోవడం, కథనం ఆసక్తిని కలిగించకపోవడం ఈ సినిమాకు సంబంధించిన మెయిన్ మైనెస్ పాయింట్స్. నిర్మాతగా ఎంతో అనుభవం ఉన్న బెక్కెం వేణు, సమర్పకుడు ‘దిల్’ రాజు ఈ కథకు ఎలా ఆమోద ముద్ర వేశారో తెలియదు. విశ్వక్ సేన్ ట్రాక్ రికార్డ్ ను దృష్టిలో పెట్టుకుని, అతని డేట్స్ ఉన్నాయని సినిమా తీశారా అనే సందేహమూ ‘పాగల్’ చూస్తుంటే కలుగుతుంది. విశ్వక్ సేన్ ను అభిమానించే వారికి ఓ మేరకు ఈ సినిమా నచ్చే ఆస్కారం ఉంది.

రేటింగ్ : 2.25 / 5

ప్లస్ పాయింట్స్
ఆర్టిస్టుల పెర్ఫామెన్స్
ఇంటర్వెల్ బ్యాంగ్
మ్యూజిక్, సినిమాటోగ్రఫీ

మైనెస్ పాయింట్స్
ఆకట్టుకోని కథ, కథనం
అలరించని ప్రేమ సన్నివేశాలు
పేలవమైన క్లయిమాక్స్

ట్యాగ్ లైన్: పగ్లీ, పాగల్!