Makutam Release Date: దర్శకుడిగా విశాల్‌కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్‌కు కౌంట్‌డౌన్!

Makutam

Makutam

Makutam Release Date: తమిళ స్టార్ హీరో విశాల్ తన కెరీర్‌లో మరో కీలక అడుగు వేయబోతున్నారు. ఇప్పటివరకు హీరోగా ఎన్నో యాక్షన్ సినిమాలలో  ప్రేక్షకులను అలరించిన ఆయన, ఇప్పుడు దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. విశాల్ దర్శకత్వం వహిస్తూ, ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మకుటం’ మూవీ 2026 ఆగస్టు 14న తెలుగు తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు రిలీజ్ డేట్ ను చిత్రబృందం ఆఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అలాగే ఆగస్టు 7న ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నట్లు కూడా వెల్లడించింది. అంతేకాదు ఈ అప్డేట్ ను ఇస్తూ ‘కిరీటం సిద్ధం’ కాప్షన్ ను కూడా జోడించారు మేకర్స్. యాక్షన్, ఎమోషన్, రివేంజ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ మూవీ విశాల్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా భావిస్తున్నారు.

‘మకుటం’ కథ ప్రశాంతంగా జీవితం గడపాలనుకునే ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అయితే నమ్మక ద్రోహం కారణంగా అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. తాను దూరంగా ఉండాలనుకున్న హింసాత్మక వారసత్వాన్ని స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తన కుటుంబాన్ని నాశనం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకునే ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు హీరో. ఎమోషన్స్ తో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఈ మూవీలో హైలెట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీలో విశాల్‌తో పాటు అంజలి, దుషారా విజయన్, జాన్ విజయ్, జయప్రకాష్, అజయ్, వంశీ కృష్ణ, అబు సలీం కీలక పాత్రల్లో నటించారు. మొదట ఈ సినిమాకు దర్శకుడు రవి అరసు బాధ్యతలు చేపట్టినప్పటికీ, కొన్ని విభేదాల కారణంగా ఆయన తప్పుకోవడంతో విశాల్ స్వయంగా దర్శకత్వం చేపట్టారు. దీంతో దర్శకుడిగా ఆయనకు ఇదే తొలి సినిమా కానుంది. కథకు రవి అరసు పేరు కొనసాగుతుండగా, స్క్రీన్‌ప్లేను విశాల్ రూపొందించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. విశాల్ చివరిసారిగా సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మధ గజ రాజా’ మూవీలో కనిపించారు. 2012లో పూర్తయిన ఈ సినిమా అనేక కారణాల వల్ల ఆలస్యంగా 2025లో విడుదలైనా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

ఇదిలా ఉండగా, విశాల్ ఇప్పటికే తన నెక్స్ట్ ప్రాజెక్ట్  ‘పురుషన్’ను కూడా ప్రకటించారు. సుందర్ సి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా కథానాయికగా నటిస్తుండగా, యోగి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది. అయితే ప్రస్తుతం అందరి దృష్టి మాత్రం విశాల్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న ‘మకుటం’ పైనే నిలిచింది. ఈ మూవీ ఆయనకు హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగానూ విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.