NTV Telugu Site icon

Vijay Devarakonad: డాన్స్ ఐకాన్ కంటెస్టెంట్ కు రౌడీ వేర్ ఆఫర్ చేసిన విజయ్ దేవరకొండ!

Vijaya Devarakonda

Vijaya Devarakonda

 

క్రేజీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. ఎవరికి ఏ అవసరం వచ్చినా ‘నేను తోడుగా ఉంటాను’ అని చెప్పడం విజయ్ దేవరకొండకు అలవాటే. ప్రకృతి వైపరీత్యాల సమయంలోనే కాదు… ఎవరికైనా వ్యక్తిగత అవసరం ఉందని అతనికి తెలిసినా వెంటనే స్పందిస్తుంటాడు. అలా ప్రస్తుతం ఆహాలో జరుగుతున్న ‘డాన్స్ ఐకాన్ షో’లో ఓ కంటెస్టెంట్ కు తాను ఉన్నాననే భరోసాను విజయ్ దేవరకొండ నిండుగా ఇచ్చాడు.

తెలంగాణలోని రాయచూర్ కు చెందిన ఆనంద్ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు. అతని తండ్రి ఆటో డ్రైవర్ కాగా, తల్లి కూరగాయల వ్యాపారం చేస్తోంది. కొడుకును ఉన్నత చదువులు చదివించాలన్నది వాళ్ళ కోరిక. అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆనంద్ చదువు ఆపేశాడు. నృత్యంలో చక్కని ప్రతిభను కనబరిచే ఆనంద్… హైదరాబాద్ కు చెందిన మోనిక దగ్గర డాన్స్ నేర్చుకున్నాడు. వీరిద్దరూ ఇప్పుడు తమ టాలెంట్ ను ఆహా లోని ‘డాన్స్ ఐకాన్ షో’లో చూపించబోతున్నారు. ఈ షో తొలి ఎపిసోడ్ లో ఆనంద్ అత్యద్భుతంగా డాన్స్ చేసి జడ్జిస్ మనసు గెలుచుకుని టాప్ 12 లో చోటు సంపాదించుకున్నాడు. ఈ సందర్బంగా కార్యక్రమ నిర్వాహకుడు, నిర్మాత ఓంకార్ చెప్పిన మాటలకు స్పెషల్ గెస్ట్ గా హాజరైన విజయ్ దేవరకొండ చెలించిపోయాడు. ధరించడానికి మంచి బట్టలు కూడా లేకుండా ఆనంద్ ఈ షోకు వచ్చాడని, కుటుంబ ఆర్థిక పరిస్థితి సైతం అంతంత మాత్రమేనని చెప్పాడు. దానికి తోడు మరో పక్క అతని తల్లి గొంతు కాన్సర్ కు చికిత్స తీసుకుంటోందని తెలిపాడు. దాంతో ఆనంద్ కు తన వంతు సాయం అందించాలని అనుకున్నాడు విజయ్ దేవరకొండ. అతన్ని ఓదార్చుతూ, తాను కూడా ఆనంద్ లానే ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్ కు వచ్చానని, ప్రతిభను నమ్ముకున్న వారికి తిరుగు ఉండద’ని భరోసా ఇచ్చాడు. అంతేకాదు… బట్టల గురించి అస్సలు ఆలోచించవద్దని, తన ఓన్ బ్రాండ్ రౌడీ వేర్ నుండి కావాల్సిన బట్టలను ఫ్రీగా ఇస్తానని తెలిపాడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ మూవీ సమయంలో తను కూడా సరైన బట్టలు లేక చాలా బాధ పడ్డానని, మూవీ ప్రమోషన్స్ కోసం సినిమాలో వేసుకున్న దుస్తులనే నిర్మాతను అడిగి తీసుకుని, వాటితోనే తిరగాన’ని చెప్పాడు.

ఇదిలా ఉంటే… ఈ పోటీలో పాల్గొనడానికి వచ్చిన డాన్సర్స్ ఇద్దరి టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాతలు ఆరుగురు ఆక్షన్ లో పాడుకొనే కాన్సెప్ట్ నూ ‘డాన్స్ ఐకాన్ షో’లో పెట్టారు. అయితే ఆనంద్ కన్నీటి గాథకు కరిగిపోయిన దిల్ రాజు కుమార్తె హన్షిత ఎలాంటి ఆక్షన్ లేకుండా తానే పది లక్షల రూపాయలు ఆఫర్ చేయడం విశేషం. తల్లి ప్రేమ ఎంత గొప్పదో తనకు తెలుసని, తాను తల్లిగా మారిన సమయంలోనే తన తల్లి అనిత చనిపోయారని, ఆనంద్ మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో చేసిన డాన్స్ తనకు ఎంతో నచ్చిందని హన్షిత తెలిపింది.